ఈ శతాబ్దంలోనే తొలిసారి.. కీలక పరిణామం!
ప్రపంచపు అగ్ర విద్యుత్ వినియోగదారులైన భారత్, చైనా 2025లో కీలకమైన మార్పును నమోదు చేశాయి. ఎనర్జీ థింక్ ట్యాంక్ 'Ember' నివేదిక ప్రకారం, ఈ శతాబ్దంలోనే తొలిసారిగా ఈ రెండు దేశాల్లో శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం తగ్గింది. ఇది గ్లోబల్ ఎనర్జీ ట్రెండ్స్‌లో వస్తున్న ప్రధాన మార్పులను సూచిస్తోంది.
భారత్ లో రెన్యూవబుల్స్ దూకుడు.. శిలాజ ఇంధనాల తగ్గుదల
భారతదేశంలో శిలాజ ఇంధనాల విద్యుత్ ఉత్పత్తి 52 టెరావాట్-గంటలు (TWh) తగ్గింది. ఇది 3.3% క్షీణత. గత నాలుగు సంవత్సరాలుగా పోస్ట్-పాండమిక్ గ్రోత్ తర్వాత ఇప్పుడు ఈ తగ్గుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో రెన్యూవబుల్ ఎనర్జీ వృద్ధి. సౌర విద్యుత్ (Solar Power) ఉత్పత్తి 53 TWh పెరిగింది, ఇది 37% పెరుగుదల. 2025లో అమెరికా కంటే భారత్ లోనే ఎక్కువ సోలార్ కెపాసిటీని ఇన్స్టాల్ చేశారు. విండ్ పవర్ ఉత్పత్తి 22 TWh, హైడ్రో పవర్ ఉత్పత్తి 21 TWh పెరిగాయి. వర్షాకాలం బాగుండటంతో హైడ్రో పవర్ ఉత్పత్తి ఊపందుకుంది. మొత్తంగా, రెన్యూవబుల్స్ రంగం మొత్తం డిమాండ్ వృద్ధి రేటు కంటే రెట్టింపు వేగంతో విస్తరించింది.
డిమాండ్ మందగించడం, బొగ్గు వాడకం తగ్గడం
2025లో భారతదేశ మొత్తం విద్యుత్ డిమాండ్ 2.4% గానే పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ వృద్ధి రేటు తగ్గింది. దీనికి కారణం వేసవిలో ఉష్ణోగ్రతలు అంత తీవ్రంగా లేకపోవడం, కూలింగ్ అవసరాలు తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు నెమ్మదించడం. ఫలితంగా, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 44 TWh ( 2.9%) తగ్గింది. 2024లో 75% ఉన్న బొగ్గు వాటా, 2025 నాటికి భారతదేశ విద్యుత్ మిశ్రమంలో 71% కి పడిపోయింది.
గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేగవంతం
ఉక్రెయిన్ యుద్ధం, ఇతర భౌగోళిక రాజకీయ సంఘటనల వల్ల గ్లోబల్ ఎనర్జీ వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో, భారత్, చైనా వంటి దేశాల్లో ఈ మార్పులు వస్తున్నాయి. ఈ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు శిలాజ ఇంధనాల నుంచి దూరం జరగడం గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను మరింత వేగవంతం చేస్తోంది. ఇది ఇంధన ఉత్పత్తిదారులు, రెన్యూవబుల్ టెక్ సంస్థలకు కొత్త అవకాశాలను, సవాళ్లను తెచ్చిపెడుతోంది. ఇంధన భద్రత, వాతావరణ లక్ష్యాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది.
