ఎస్టోనియాలో ఉన్న Milrem Robotics ఫెసిలిటీపై జరిగిన అగ్నిప్రమాదం సాధారణ ప్రమాదం కాదని, అది రష్యా ప్లాన్ చేసిన విధ్వంసమేనని ఎస్టోనియా సెక్యూరిటీ ఏజెన్సీలు ధృవీకరించాయి.
అసలేం జరిగింది?
గత ఆగస్టు 15న టల్లిన్‌లోని Milrem Robotics కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేసిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఉక్రెయిన్ యుద్ధభూమిలో కీలక పాత్ర పోషిస్తున్న THeMIS అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ తయారీ యూనిట్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ విధ్వంసం జరిగిందని తేలింది. రష్యా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు పక్కా ప్లాన్‌తో ఈ పని చేశారని ఎస్టోనియా సెక్యూరిటీ సర్వీస్ స్పష్టం చేసింది.
నిందితుల అరెస్ట్..
ఈ ఘటన జరిగిన వెంటనే ఎస్టోనియా పోలీసులు వేగంగా స్పందించి, నిందితులను లాత్వియా సరిహద్దులో పట్టుకున్నారు. ఆగస్టు 17న ఇద్దరిని, మరుసటి రోజు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను ఎస్టోనియాకు రప్పించి, విచారణ కొనసాగిస్తున్నారు. ఐరోపా వ్యాప్తంగా రష్యా ఇటువంటి 200కి పైగా విధ్వంసకర చర్యలకు పాల్పడినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
పెరిగిన భద్రతా సవాళ్లు
2023లో UAEకి చెందిన Edge Group చేజిక్కించుకున్న Milrem Robotics వంటి రక్షణ సంస్థలకు ఇప్పుడు భద్రత పెద్ద సవాలుగా మారింది. ఐరోపా దేశాల రక్షణ సరఫరా వ్యవస్థలపై (Defense Supply Chain) ఇటువంటి దాడులు పెరగడంతో, రక్షణ కంపెనీలు తమ సెక్యూరిటీ కోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నందునే రష్యా ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సాహ్క్నా ఆరోపించారు.
