FASTag వినియోగదారులకు కేంద్రం ఊరటనిస్తూ 'OneTag' సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పాత RFID స్టిక్కర్‌ను తొలగించకుండానే, బ్యాంక్‌ను సులభంగా మార్చుకునే వీలు కల్పించింది. ఈ సేవలు 'Rajmargyatra' మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహనదారుల సౌకర్యార్థం 'OneTag' అనే కొత్త పోర్టబిలిటీ విధానాన్ని తీసుకువచ్చింది. సెప్టెంబర్ 11, 2026న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిని అధికారికంగా ప్రారంభించారు.
వన్‌ట్యాగ్ ఎలా పనిచేస్తుంది?
గతంలో వేరే బ్యాంక్‌కు మారాలంటే పాత ఫాస్టాగ్‌ను రద్దు చేసుకుని, కొత్త స్టిక్కర్‌ను అంటించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పాత RFID ట్యాగ్, ట్యాగ్ ఐడీ, వెహికల్ నంబర్‌ను అలాగే ఉంచి, కేవలం బ్యాంక్ సర్వర్‌ను మాత్రమే మార్చుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ప్రభుత్వానికి చెందిన 'Rajmargyatra' యాప్ ద్వారా IHMCL మరియు NPCI సహకారంతో పూర్తవుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. నేషనల్ హైవే టోల్ ప్లాజాల వద్ద 98% మేర ఫాస్టాగ్ వినియోగం ఉండటంతో, ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ వల్ల టోల్ నిర్వహణ మరింత సులభతరం కానుంది.
ఆర్థిక లావాదేవీలు ఎలా?
బ్యాంక్ మారే ప్రక్రియలో ఉన్నప్పుడు, పాత బ్యాంక్ మాత్రమే పెండింగ్ ట్రాన్సాక్షన్‌లు, రిఫండ్స్ మరియు వాలెట్ బ్యాలెన్స్‌లను సెటిల్ చేసే బాధ్యతను కలిగి ఉంటుంది. దీనివల్ల వినియోగదారులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది కొత్త స్టిక్కర్ల తయారీకి అయ్యే ఖర్చు, వ్యర్థాలు తగ్గుతాయి. భవిష్యత్తులో బారియర్-ఫ్రీ టోల్ సిస్టమ్ మరియు లోకలైజ్డ్ పాసుల వంటి మరిన్ని అత్యాధునిక ఫీచర్లను తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
