న్యూఢిల్లీ: దేశీయ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్‌ను సొంతం చేసుకోవడానికి ఎలాంటి పాలసీ అడ్డంకి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కొన్ని ఎయిర్‌పోర్టులకు సంబంధించిన పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) ఒప్పందాలలో పరిమితులు ఉండొచ్చని తెలిపింది. అదానీ గ్రూప్ ఎయిర్‌లైన్ రంగంలోకి ప్రవేశించవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.
ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు.. ఎయిర్‌లైన్స్.. నో ప్రాబ్లమ్!
విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు.. సొంతంగా విమానయాన సంస్థలను నడుపుకోవడానికి దేశంలో ఎలాంటి పాలసీ పరమైన నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. అయితే, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చెందిన కొన్ని ఎయిర్‌పోర్టులకు సంబంధించిన ఒప్పందాలలో మాత్రం కొన్ని ప్రత్యేకమైన పరిమితులు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అదానీ ఎంట్రీ.. పరిశ్రమలో చర్చ!
ప్రస్తుతం 8 ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్.. విమానయాన వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తాము అలాంటి యోచనలో లేదని అదానీ గ్రూప్ ఇదివరకే తెలిపింది. ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఎయిర్‌లైన్స్ ను సొంతం చేసుకునే అవకాశంపై పరిశ్రమలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. IndiGo సహ-వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా దీనిని 'భారీ కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' (Massive Conflict of Interest) గా అభివర్ణించారు. మరోవైపు, ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దూబే మాత్రం ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. దేశీయ విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పోటీ పెరగడం మంచిదేనని, అయితే ప్రభుత్వం అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
AAI పరిశీలనలో అభ్యర్థన
PPP ఎయిర్‌పోర్ట్ ఒప్పందాలలో ఎయిర్‌లైన్ యాజమాన్యానికి సంబంధించిన ఆంక్షలను సడలించాలంటూ.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి ఒక అభ్యర్థన అందింది. ఈ అభ్యర్థనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన ఎయిర్‌పోర్టులు PPP పద్ధతిలో నడుస్తున్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి ఒప్పందాలలో (OMDAs) AAI వాటా కూడా ఉంది. ఈ ఒప్పందాలలో ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి.
