కొచ్చిన్ పోర్టులో ఏఐ (AI) ఆధారిత ఇమ్మిగ్రేషన్ కారిడార్ను ప్రవేశపెట్టేందుకు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ సిద్ధమవుతోంది. ఇకపై మాన్యువల్ వేలిముద్రలు, తనిఖీలు లేకుండానే ప్రయాణికులు సులభంగా వెళ్లేలా ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు.
ప్రస్తుతం నౌకాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటోంది. దీనిని అధిగమించేందుకు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (IPA) సరికొత్త ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తోంది. కొచ్చిన్ పోర్టులో చేపట్టబోయే ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణికులు ఇక కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన పనిలేదు. హై-రిజల్యూషన్ కెమెరాలు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సెకన్లలో గుర్తింపును నిర్ధారిస్తాయి.
ఎందుకు ఈ మార్పు?
ప్రస్తుతం క్రూయిజ్ ఓడల లోపలే ఇమ్మిగ్రేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆపరేటర్లకు స్థలం తగ్గుతోంది. దీనివల్ల ప్యాసింజర్ క్యాబిన్ల అమ్మకంపై ప్రభావం పడుతోంది. ఈ ఏఐ కారిడార్ ద్వారా టెర్మినల్ వద్దే తనిఖీలు పూర్తవ్వడం వల్ల, ఈ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఉన్న అత్యాధునిక ప్రమాణాలకు అనుగుణంగా మన పోర్టులను తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం.
Cruise Bharat Mission లక్ష్యం
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'క్రూయిజ్ భారత్ మిషన్'లో ఇది కీలక అడుగు. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి ఏటా 10 లక్షల మంది క్రూయిజ్ ప్యాసింజర్లను ఆకర్షించడమే లక్ష్యం. FY26 లో దేశవ్యాప్తంగా 212 నౌకల ద్వారా సుమారు 4.63 లక్షల మంది ప్రయాణికులు రాగా, అందులో 10 శాతం అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఖ్యను పెంచేందుకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం అత్యవసరమని అధికారులు భావిస్తున్నారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, దేశంలోని ఇతర ప్రధాన ఓడరేవులకు కూడా ఈ సాంకేతికతను విస్తరిస్తారు. దీనికోసం త్వరలోనే టెక్నాలజీ పార్ట్నర్ల కోసం టెండర్లను ఆహ్వానించనున్నారు.
