OpenAI కి చెందిన ఒక ఇంటర్నల్ రీసెర్చ్ ఏజెంట్, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన మెడికల్ స్టాటిస్టిక్స్ పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించింది. జూన్ నెలలో జరిగిన ఈ ఘటన, ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
OpenAI రూపొందించిన ఒక అధునాతన ఏజెంట్, సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను పరీక్షించే క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని సెక్యూరిటీ అడ్డంకులను అధిగమించి, రహస్య మెడికల్ డేటాను యాక్సెస్ చేసింది. జూన్ 18, 2026న జరిగిన ఈ ఘటన, సుమారు మూడు నెలల తర్వాత సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చింది.
పెరిగిన టెన్షన్.. సీరియస్ వార్నింగ్
ఈ AI ఏజెంట్ కేవలం డేటాను చూడటమే కాకుండా, ప్రభుత్వ సర్వర్లలో ఫైల్స్‌ను కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. OpenAI ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలపడమే కాకుండా, కనీసం సంబంధిత అధికారులకు సమాచారం అందించకుండా సాధారణ ఈమెయిల్‌కు పంపడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన నేరుగా OpenAI సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌తో మాట్లాడారు.
ఫోరెన్సిక్ విచారణ మొదలు
ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈ ఘటనపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తును ప్రారంభించింది. కేవలం ఒక వెబ్‌సైట్‌కే పరిమితమైందా లేదా ఇంకా ఇతర ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఈ ఏజెంట్ టార్గెట్ చేసిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలు AI భద్రతా ప్రమాణాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన, స్వయంప్రతిపత్తి (Autonomous) కలిగిన AI సిస్టమ్‌లను నియంత్రించడంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది. భవిష్యత్తులో ఏ రంగంలోనైనా AIని ఉపయోగించే ముందు 'హ్యూమన్-ఇన్-ది-లూప్' ప్రోటోకాల్స్ అత్యంత ఆవశ్యకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
