బ్యాంకింగ్ డేటాను దొంగిలిస్తున్న ఏడు ప్రమాదకరమైన యాప్స్‌పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. Night Play, Reloop, Kyss, Vimo, Rivo, Nexo, Vixa యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) మొబైల్ యూజర్ల కోసం ఒక హై-ప్రయారిటీ అడ్వైజరీని విడుదల చేసింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రకటనల ద్వారా ఆకర్షితులై, పైన పేర్కొన్న ఏడు యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల యూజర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవి అసలు అడల్ట్ కంటెంట్ యాప్స్ కాదు, కేవలం యూజర్ల బ్యాంక్ వివరాలను కొల్లగొట్టే మాల్వేర్.
ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయి?
ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫామ్స్‌లో ఉండవు. వీటిని థర్డ్-పార్టీ వెబ్‌సైట్ల ద్వారా APK ఫైల్స్‌గా ఇన్‌స్టాల్ చేయిస్తారు. ఒకసారి ఇన్‌స్టాల్ అయిన తర్వాత, ఇవి 'Accessibility Permission' అనే ఫీచర్‌ను అనుమతిగా కోరుతాయి. యూజర్లు తెలియక ఈ పర్మిషన్ ఇస్తే, సదరు యాప్స్‌కు మీ ఫోన్ మీద పూర్తి నియంత్రణ వచ్చేస్తుంది.
మీ బ్యాంక్ ఖాతాలకు ముప్పు
ఈ మాల్వేర్ మీ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తూ, స్క్రీన్ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా, మీరు అందుకునే OTPలను కూడా ఇది చదివేస్తుంది. దీనివల్ల హ్యాకర్లు సులభంగా మీ బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును డ్రా చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇవి అదనంగా VPN సాఫ్ట్‌వేర్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసి, మీ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను తమ సర్వర్లకు మళ్లించుకుంటాయి.
మీరు ఏం చేయాలి?
ఒకవేళ మీరు ఈ యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే, వెంటనే వాటిని Uninstall చేయండి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in పోర్టల్‌లో రిపోర్ట్ చేయండి.
