అసలు వివాదం ఏంటి?
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో అమలవుతున్న డిజి యాత్ర (Digi Yatra) ప్లాట్‌ఫామ్‌కు కావాల్సిన సాఫ్ట్‌వేర్, సంబంధిత అప్లికేషన్లపై తమకే హక్కు ఉందని డేటా ఎవాల్వ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోపిస్తోంది. అయితే, దీనిపై ట్రయల్ కోర్టు తమకు ఎక్స్-పార్టీ ఇంటర్రమ్ ఇంజెక్షన్ మంజూరు చేయడానికి నిరాకరించడంతో, ఈ కంపెనీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్, రంగారెడ్డి జిల్లాలోని కమర్షియల్ కోర్టు ఈ అప్లికేషన్‌ను 4 వారాలలోపు పరిష్కరించాలని ఆదేశించింది.
మేధో సంపత్తి హక్కులకు ప్రాధాన్యం
మేధో సంపత్తి హక్కుల (Intellectual Property) వివాదాల్లో ఉండే అత్యవసర పరిస్థితిని కోర్టు గుర్తించింది. ప్రతివాదులు తమ సమాధానాలు దాఖలు చేయడానికి ట్రయల్ కోర్టు అనేక వాయిదాలు ఇచ్చినట్లు హైకోర్టు గమనించింది. పిటిషనర్ కోరిన అత్యవసరానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ట్రయల్ కోర్టుకు సూచించినప్పటికీ, కాపీరైట్ క్లెయిమ్‌ల యోగ్యతపై కోర్టు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.
ఢిల్లీలోనూ వేరే కేసు
ఇదే డిజి యాత్రకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులోనూ మరో వివాదం నడుస్తోంది. అక్కడ, డిజి యాత్ర ఫౌండేషన్, 2021 నాటి మినిమం వయబుల్ ప్రొడక్ట్ అగ్రిమెంట్ (MVA) ప్రకారం, డిజి యాత్ర సెంట్రల్ ఎకోసిస్టమ్ యాజమాన్యం, నియంత్రణపై డేటా ఎవాల్వ్‌పై దావా వేసింది. KPMG తమ సాఫ్ట్‌వేర్‌ను క్లోన్ చేసి, MVAలో అనుమతించిన 4 విమానాశ్రయాలకు మించి 28 విమానాశ్రయాలలో అమలయ్యేలా చేసిందని డేటా ఎవాల్వ్ ఆరోపిస్తోంది.
ఫౌండేషన్-డేటా ఎవాల్వ్ మధ్య విభేదాలు
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation) క్రింద పనిచేసే లాభాపేక్షలేని సంస్థ అయిన డిజి యాత్ర ఫౌండేషన్, మే 2021లో డేటా ఎవాల్వ్‌ను ఎంపిక చేసింది. MVA ప్రకారం, డేటా ఎవాల్వ్ యొక్క ముందస్తు సాఫ్ట్‌వేర్‌ను మినహాయించి, ప్లాట్‌ఫామ్‌లోని అన్ని మేధో సంపత్తి హక్కులు ఫౌండేషన్‌కు చెందుతాయని నిబంధన ఉంది. అయితే, 2023 చివరిలో విభేదాలు తలెత్తడంతో, ఫౌండేషన్ జనవరి 2024లో ఒక డిస్‌ఎంగేజ్‌మెంట్ లెటర్ (విడిపోతున్నట్లు లేఖ) జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ, డేటా ఎవాల్వ్ చెల్లింపులను సక్రమంగా చేయకుండా అట్టిపెట్టుకున్నారని, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌పై తమకే హక్కు ఉందని వాదిస్తోంది.