RBI తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో, Tata Sons ఇప్పుడు తప్పనిసరిగా పబ్లిక్ లిస్టింగ్ (IPO) మార్గంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కంపెనీ బోర్డు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
RBI నిర్ణయం.. మారుతున్న సమీకరణాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), Tata Sonsని 'కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ' (CIC) హోదా నుంచి తొలగించేందుకు నిరాకరించింది. దీనివల్ల ఆ కంపెనీ ఇప్పుడు 'అప్పర్ లేయర్' నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)గా కొనసాగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, ఈ కేటగిరీలో ఉన్న కంపెనీలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తమ షేర్లను లిస్ట్ (IPO) చేయాల్సి ఉంటుంది. RBI దీనిపై కఠినంగా ఉండటంతో, బాంబే హైకోర్టులో ఇప్పటికే కేవియట్ కూడా దాఖలు చేసింది.
చంద్రశేఖరన్ కొనసాగుతారా?
ఈ బోర్డు సమావేశంలో మరొక ముఖ్యమైన అంశం చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భవిష్యత్తు. ఆయన పదవీకాలం 2027, ఫిబ్రవరి 20తో ముగియనుంది. IPO వంటి క్లిష్టమైన ప్రక్రియను చేపట్టే క్రమంలో, అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని భావిస్తున్న కొంతమంది బోర్డు సభ్యులు, ఆయనకు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నట్లు సమాచారం.
ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి?
Tata Sonsలో 66% వాటా కలిగిన Tata Trustsకు నాయకత్వం వహిస్తున్న నోయల్ టాటా ఇప్పుడు కీలక నిర్ణయాధికారిగా ఉన్నారు. కంపెనీ ఈ నిబంధనను పాటిస్తుందా? లేక చట్టపరంగా సవాల్ చేస్తుందా? అనే దానిపైనే గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల షేర్ల కదలికలు ఆధారపడి ఉన్నాయి. మార్కెట్ వర్గాలు ఈ బోర్డు సమావేశం నుండి వచ్చే అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
