భారత్‌తో భూ సరిహద్దు పంచుకునే దేశాల నుంచి డైరెక్టర్లను నియమించుకునే విదేశీ అనుబంధ సంస్థలపై MCA కఠిన ఆంక్షలు విధించింది. వీరు ఇకపై తప్పనిసరిగా 'e-Sahaj' పోర్టల్ ద్వారా సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) విదేశీ కంపెనీల కార్యకలాపాలపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా చైనా వంటి భారత్‌తో సరిహద్దు పంచుకునే దేశాలకు చెందిన వ్యక్తులను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా నియమించుకునేటప్పుడు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి 'e-Sahaj' పోర్టల్ ద్వారా ముందస్తు సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవడం అనివార్యం అని స్పష్టం చేసింది. ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే DIN (Director Identification Number) ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది.
సింగిల్ విండో కాదు.. సెక్యూరిటీ ముఖ్యం!
ప్రభుత్వం వ్యాపార సులభతరానికి 'నేషనల్ సింగిల్ విండో సిస్టమ్'ను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇది చట్టబద్ధమైన రెగ్యులేటరీ ఆమోదాలకు ప్రత్యామ్నాయం కాదని మంత్రిత్వ శాఖ గుర్తుచేసింది. విదేశీ అనుబంధ సంస్థలు తప్పనిసరిగా Form FC-1 ను వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన 30 రోజుల్లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది.
పేరు నమోదులో నిబంధనలు
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) ఇప్పుడు పేర్ల నమోదులో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. గ్లోబల్ బ్రాండ్ పేరుకు చివరన 'India' అని చేర్చినంత మాత్రాన అది ప్రత్యేకమైన పేరుగా పరిగణించబడదు. ఇప్పటికే ఉన్న భారతీయ కంపెనీల ట్రేడ్‌మార్క్‌లతో పేర్లు కలిస్తే, గ్లోబల్ పేటెంట్ ఉన్నప్పటికీ ఆ సంస్థలు 'No Objection Certificate' (NOC) సమర్పించాల్సిందే.
CSR మరియు ఆర్థిక నిబంధనలు
విదేశీ సంస్థలకు CSR నిబంధనల నుండి మినహాయింపు లేదు. ₹500 కోట్ల నెట్ వర్త్ లేదా ₹1,000 కోట్ల టర్నోవర్ లేదా ₹5 కోట్ల నెట్ ప్రాఫిట్ ఉన్న సంస్థలు తప్పనిసరిగా CSR నిధులు ఖర్చు చేయాలి. అలాగే, షేర్ క్యాపిటల్ విలువను 'సున్నా' (Zero) గా నమోదు చేయడాన్ని MCA పూర్తిగా నిషేధించింది. ఈ మార్పులను పాటించని పక్షంలో దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో పాటు, చట్టపరమైన విచారణలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
