ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (IBBI) కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ సంస్థల మొత్తం ఆస్తులను అమ్మేయకుండా, ప్రాజెక్టుల వారీగా పరిష్కరించే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనివల్ల 553 కేసుల్లో చిక్కుకున్న సుమారు 2.5 లక్షల మంది హోమ్ బయర్లకు ఊరట లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దివాళా తీస్తే, ఆ సంస్థ చేతిలో ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపి ఒకేసారి విచారణకు పంపుతున్నారు. దీనివల్ల దాదాపు పూర్తయిన ఇళ్లు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడి, అపార్ట్‌మెంట్లు పూర్తి కావడానికి ఏళ్ల సమయం పడుతోంది. ఇప్పుడు దీన్ని మార్చాలని IBBI యోచిస్తోంది.
కొత్త విధానంలో ఏముంది?
IBBI ప్రతిపాదన ప్రకారం, ఇకపై ప్రాజెక్టులను వేర్వేరుగా విభజించి పరిష్కారం కనుగొంటారు. దీనివల్ల ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడవచ్చు. ప్రధానంగా రెండు విషయాలకు IBBI ప్రాధాన్యత ఇస్తోంది:
- పారదర్శకత: రిజల్యూషన్ ప్రొఫెషనల్స్ (RPs) స్వతంత్ర ఏజెన్సీలతో కన్స్ట్రక్షన్ స్టేటస్, మిగిలి ఉన్న ఖర్చులను ఆడిట్ చేయించాలి.
- లిక్విడిటీ: RERA నిబంధనల ప్రకారం ఉన్న ప్రాజెక్ట్ అకౌంట్లను స్తంభింపజేయకుండా, కన్స్ట్రక్షన్ కొనసాగేలా నిధుల లభ్యత ఉండేలా చూస్తారు.
ఇబ్బందులు ఏంటి?
ఈ ప్రతిపాదనలు వినడానికి బాగున్నా, క్షేత్రస్థాయిలో అమలులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా NCLT (National Company Law Tribunal) ఆమోదించిన నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరిగే పనుల మధ్య గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకర్లు తమ డబ్బు కోసం, హోమ్ బయర్లు తమ ఇళ్ల కోసం పట్టుబట్టడం వంటి న్యాయపరమైన వివాదాలు ఈ కొత్త పద్ధతిలోనూ రావచ్చు. ఇప్పటివరకు దివాళా ప్రక్రియ ద్వారా 1.4 లక్షల మందికి లబ్ధి చేకూరగా, మిగిలిన 2.5 లక్షల మందికి ఈ కొత్త మార్పు ఏ మేరకు ఊరటనిస్తుందో వేచి చూడాలి.
