దేశంలోని ప్రముఖ డిబెంచర్ ట్రస్టీ సంస్థలపై Competition Commission of India (CCI) కొరడా ఝళిపించింది. ఫీజుల నిర్ణయంలో సిండికేట్‌గా వ్యవహరిస్తూ, పోటీని దెబ్బతీస్తున్నారన్న ఆరోపణలతో ఈ సంస్థలకు 'సీజ్ అండ్ డెసిస్ట్' ఆదేశాలు జారీ చేసింది.
డిబెంచర్ ట్రస్టీషిప్ సేవలకు సంబంధించి ఫీజులను తమకు నచ్చినట్లుగా ఫిక్స్ చేసుకుంటున్న సంస్థలపై CCI తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. Trustees’ Association of India (TAI), IDBI Trusteeship Services, Axis Trustee Services, మరియు SBI CAP Trustee Companyలపై ఈ విచారణ జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఈ సంస్థలు అనుసరించిన ధరల విధానంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు CCI దర్యాప్తు చేపట్టింది.
అసలు ఏం జరిగింది?
ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) ₹982 కోట్ల విలువైన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల కోసం కొటేషన్లు అడిగినప్పుడు, ట్రస్టీ సంస్థలన్నీ ఒకే రకమైన ధరలను కోట్ చేయడం గమనించింది. దీంతో రంగంలోకి దిగిన CCI, ఈ సంస్థలు ఒక సిండికేట్‌లా మారి ఫీజులను పెంచాయని తేల్చింది. దీనివల్ల మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీ తగ్గిందని రిపోర్టులో పేర్కొంది.
పెనాల్టీ లేదు.. కానీ హెచ్చరిక!
ఈసారికి ఆర్థికపరమైన జరిమానాలు వేయకపోయినప్పటికీ, CCI చాలా కఠినంగా స్పందించింది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులు పాటిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ట్రస్టీలు తమ ఫీజుల నిర్ణయంలో పూర్తి స్వతంత్రంగా ఉండాలని, ఎవరికీ లోబడి ధరలు నిర్ణయించకూడదని ఆదేశించింది.
ఈ పరిణామం డిబెంచర్ మార్కెట్‌లో పారదర్శకతకు దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇకపై డిబెంచర్ ఇష్యూ చేసే సంస్థలకు తక్కువ ధరకే ట్రస్టీషిప్ సేవలు పొందే అవకాశం పెరగనుంది.
