CBIC కొత్త GST నిబంధనలను విడుదల చేసింది. ఇకపై సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లు తమ నిర్వహణ ఖర్చులపై Input Tax Credit (ITC) క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, బ్యాంకులు మరియు NBFCల మధ్య జరిగే కో-లెండింగ్ సేవలను ట్యాక్సబుల్‌గా ప్రకటించింది.
యూజ్డ్ కార్ డీలర్లకు భారీ ఊరట
సాధారణంగా యూజ్డ్ కార్ డీలర్లు 'మార్జిన్ స్కీమ్' ద్వారా GST చెల్లిస్తుంటారు. అంటే కారు కొన్న, అమ్మిన ధరల మధ్య ఉన్న వ్యత్యాసంపైనే పన్ను ఉంటుంది. అయితే, నిర్వహణ ఖర్చుల (operational expenses) విషయంలో చాలా కాలంగా గందరగోళం ఉండేది. తాజాగా CBIC ఇచ్చిన స్పష్టతతో, డీలర్లు కార్ల రిపేర్లు, మెయింటెనెన్స్, మార్కెటింగ్ మరియు టెక్నాలజీ సేవలకు సంబంధించి ITC క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై మాత్రం ఎటువంటి ITC లభించదని స్పష్టం చేసింది.
కో-లెండింగ్ సేవలకు ట్యాక్స్ బాదుడు
ఫైనాన్షియల్ సెక్టార్‌లో NBFCలు మరియు బ్యాంకులు కలిసి పనిచేసే 'కో-లెండింగ్' మోడల్‌పై CBIC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై NBFCలు బ్యాంకులకు అందించే లోన్ ఒరిజినేషన్, KYC మరియు కలెక్షన్ వంటి సేవలు GST పరిధిలోకి వస్తాయి. ఈ సేవలపై కాంట్రాక్టులో నిర్ణయించుకున్న ఫీజుల ప్రాతిపదికన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను ఎగవేతలకు తావులేకుండా, అకౌంటింగ్ విధానం మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఆటో మొబైల్ రంగంలో కార్పొరేట్ డీలర్లకు ఖర్చులు తగ్గే అవకాశం ఉండగా, ఫైనాన్స్ సంస్థలు తమ అగ్రిమెంట్లను కొత్త ట్యాక్స్ నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.
