కరెన్సీ భర్తీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నం
ప్రతి సంవత్సరం పాడైపోయిన, చిరిగిపోయిన నోట్లను పెద్ద మొత్తంలో భర్తీ చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా అధిక విలువ గల నోట్ల మార్పిడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. పాలిమర్ నోట్లు తేమ, భౌతిక అరుగుదలను తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఇవి సాధారణ కాగితపు నోట్ల కంటే రెట్టింపు కాలం మన్నుతాయని అంచనా. ఈ సామర్థ్యం వల్ల నోట్ల ప్రింటింగ్, లాజిస్టిక్స్ పై వెచ్చించే ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చని RBI భావిస్తోంది.
నకిలీలకు అడ్డుకట్ట?
పాలిమర్ సబ్‌స్ట్రేట్‌తో, అసాధారణమైన భద్రతా లక్షణాలను (Security Features) నోట్లలో చేర్చవచ్చు. ఉదాహరణకు, ప్రత్యేకమైన విండోలు, కాంతిలో మెరిసే హోలోగ్రామ్‌లు వంటివి. వీటిని నకిలీ చేయడం చాలా కష్టం. ఈ ఆధునిక టెక్నాలజీతో నకిలీ కరెన్సీ తయారీని అరికట్టవచ్చని RBI భావిస్తోంది. అయితే, ఈ టెక్నాలజీ ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది ప్రజల అవగాహన, దానిని సరిచూసుకునే అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల అనుభవం ప్రకారం, తక్కువ నాణ్యత గల నకిలీలను ఇది తగ్గించినా, ఉన్నత స్థాయి నకిలీలను పూర్తిగా అరికట్టలేకపోవచ్చు.
గతంలో ఎందుకు ఆగిపోయింది?
ఈ పాలిమర్ నోట్ల ఆలోచన RBIకి కొత్తేమీ కాదు. 2007 నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయి. 2016 లో టెండర్లు కూడా పిలిచినా, చివరికి ఆగిపోయాయి. పాలిమర్ నోట్లను ప్రింట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా మార్చాలి. దీనికి భారీ పెట్టుబడులు అవసరం. గతంలో ప్రయత్నించిన వార్నిష్ పూత పూసిన నోట్లు (Varnished Notes) తాత్కాలిక పరిష్కారాలే. భారత ఆర్థిక వ్యవస్థ స్థాయిని దృష్టిలో ఉంచుకుంటే, కొత్త కరెన్సీని ముద్రించి, పంపిణీ చేయడంలో ఉన్న భారీ లాజిస్టికల్స్ ను అధిగమించడం పెద్ద సవాలు.
అమలులో ఎదురయ్యే సమస్యలు
ప్రత్యేకమైన ప్రింటింగ్ టెక్నాలజీని సేకరించే ప్రక్రియలో జాప్యం, నియంత్రణాపరమైన పరిశీలనలు వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. అంతేకాకుండా, ఈ కొత్త నోట్లు కొంచెం జారే స్వభావం కలిగి ఉండటం, మెకానికల్ కౌంటింగ్ మెషీన్లలో లెక్కించడం కష్టమవడం వల్ల నగదు నిర్వహణలో తాత్కాలిక ఇబ్బందులు తలెత్తవచ్చు. దీర్ఘకాలంలో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయనే అంచనా ఉన్నప్పటికీ, గతంలో జరిగిన పైలట్ ప్రాజెక్టుల వైఫల్యం దృష్ట్యా, టెండర్ ప్రకటనలు, ప్రింటింగ్ యూనిట్ల ఆధునీకరణ జరిగే వరకు వేచి చూడాల్సిందే.
