బిల్డర్ ప్రాజెక్ట్ ఆపేశారని చాలామంది బ్యాంక్ లోన్ EMIలు చెల్లించడం ఆపేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. బ్యాంక్ మరియు డెవలపర్ మధ్య ఒప్పందాలు వేర్వేరు. లోన్ కట్టడం ఆపితే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిని, భవిష్యత్తులో రుణాలు పుట్టడం కష్టమవుతుంది.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ డెవలపర్ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిపివేసినప్పుడు ఆ కల కాస్తా కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు.. బ్యాంక్ EMI లేదా ప్రీ-EMI చెల్లించడం ఆపేయడం. బిల్డర్ పని పూర్తి చేయలేదు కాబట్టి, బ్యాంక్ కూడా లోన్ ఆపేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ చట్టపరంగా ఇది వాస్తవం కాదు.
బ్యాంక్ మరియు మీ మధ్య ఒప్పందం ఏమిటి?
మీ హోమ్ లోన్ ఒప్పందం అనేది పూర్తిగా మీకూ, బ్యాంకుకు మధ్య మాత్రమే ఉంటుంది. బ్యాంక్ మీకు డబ్బు ఇచ్చింది కాబట్టి, కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నా లేదా ఆగిపోయినా.. అసలు మరియు వడ్డీని సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత మీదే. ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యిందనే కారణంతో EMI చెల్లించకపోతే, బ్యాంకులు ఆ లోన్‌ను డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి.
క్రెడిట్ స్కోర్ పై ఎఫెక్ట్ ఎంత?
మీరు లోన్ చెల్లించకపోతే, బ్యాంకులు ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తాయి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోతుంది. ఇది మీ 'ఫైనాన్షియల్ ఐడెంటిటీ'ని దెబ్బతీస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో మీకు పర్సనల్ లోన్లు, కార్ లోన్లు లేదా క్రెడిట్ కార్డులు దొరకడం చాలా కష్టమవుతుంది. ఆస్తి సమస్య కంటే, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ మీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి?
- క్రెడిట్ స్కోర్ కాపాడుకోండి: మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ EMI చెల్లింపులు ఆపకండి. లోన్ అకౌంట్‌ను 'స్టాండర్డ్' కేటగిరీలో ఉంచడం చాలా ముఖ్యం.
- ఆస్తులను విక్రయించడం: ఒకవేళ అద్దె కడుతూ లోన్ చెల్లించడం భారమైతే, ఆ అండర్-కన్స్ట్రక్షన్ యూనిట్‌ను వేరే వారికి అమ్మే ప్రయత్నం చేయండి. లేదా బ్యాంక్, డెవలపర్లతో మాట్లాడి సెటిల్మెంట్కు ప్రయత్నించండి.
- చట్టపరమైన పోరాటం: RERA లేదా NCLT వంటి వేదికల ద్వారా బిల్డర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఒకవైపు చేస్తుండాలి. అయితే, వీటిని మరియు మీ బ్యాంక్ లోన్ బాధ్యతలను విడివిడిగా చూడాలి. బిల్డర్ సమస్య పరిష్కరించే వరకు వేచి చూడటం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది.
