ఇన్కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) కీలక తీర్పునిచ్చింది. ప్రాపర్టీ అమ్మకానికి నేరుగా సంబంధం లేని ప్రయాణ ఖర్చులను, NRIs తమ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నుండి మినహాయించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) బెంగళూరు బెంచ్, భారత్‌లో ఆస్తులు విక్రయించే ఎన్నారైలకు (NRIs) పన్ను మినహాయింపులపై స్పష్టతనిచ్చింది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 48 ప్రకారం, ప్రాపర్టీ అమ్మకానికి సంబంధించిన ఖర్చులను మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ నుండి మినహాయించుకోవడానికి అవకాశం ఉంటుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే!
అమెరికాలో ఉంటున్న ఒక ఎన్నారై, తన ప్రయాణం మరియు వసతి కోసం అయిన ₹12.01 లక్షలను ఖర్చుగా చూపించి మినహాయింపు కోరారు. అయితే, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు చాలా కాలం ముందు జరిగిన ప్రయాణాలను ఆస్తి బదిలీకి జరిగిన ఖర్చుగా పరిగణించలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఇలాంటి బ్లైండ్ క్లెయిమ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ అంగీకరించదని కోర్టు తేల్చిచెప్పింది.
ఆధారాలు కీలకం
పర్సనల్ ట్రిప్స్ మరియు ప్రాపర్టీ పనుల కోసం చేసే ప్రయాణాలను వేరుగా ఉంచడం కష్టమని ట్రిబ్యునల్ గుర్తించింది. కాబట్టి, నిరూపించుకునే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే. ప్రయాణ తేదీలు, ఫ్లైట్ వివరాలు, హోటల్ బిల్లులు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ సమయంతో సరిపోలాలి. కుటుంబంతో చేసిన ట్రిప్స్ లేదా పర్సనల్ వెకేషన్లను ప్రాపర్టీ ఖర్చుగా చూపితే అవి ఖచ్చితంగా తిరస్కరించబడతాయి.
హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మినహాయింపు
ప్రయాణ ఖర్చులపై కఠినంగా ఉన్నప్పటికీ, 'కొనుగోలు వ్యయం' (Acquisition Cost) విషయంలో ITAT కాస్త వెసులుబాటు ఇచ్చింది. సెక్షన్ 24(b) కింద క్లెయిమ్ చేయని పక్షంలో, ₹21.60 లక్షల హోమ్ లోన్ వడ్డీని మరియు మెయింటెనెన్స్ డిపాజిట్లను ఆస్తి కొనుగోలు వ్యయంలో భాగంగా చూపవచ్చని పేర్కొంది. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గించుకోవడానికి ఎన్నారైలకు ఒక గొప్ప అవకాశం.
స్క్రూటినీ రిస్క్
ప్రస్తుతం ఐటీ శాఖ 'Annual Information Statement' (AIS) ద్వారా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, TDS రిటర్నులు మరియు విదేశీ నగదు బదిలీలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అనవసరమైన ఖర్చులు చూపి పన్ను ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తే, ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఖర్చుకు సంబంధించి కచ్చితమైన రికార్డులను నిర్వహించుకోవడం ఉత్తమం.
