హోమ్ లోన్ వడ్డీ రేటు మాత్రమే చూసి మోసపోకండి. ప్రాసెసింగ్, లీగల్, ఇన్సూరెన్స్ వంటి దాగున్న ఛార్జీలను అర్థం చేసుకోవడం, RBI సూచించిన 'Key Facts Statement' గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంకులు చెప్పే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి, కానీ అసలు కథ వేరుగా ఉంటుంది. రుణం తీసుకునేటప్పుడు కొన్ని తెలియని ఛార్జీలు అదనంగా పడి, మొత్తం భారాన్ని పెంచుతాయి.
దాగున్న ఛార్జీలు ఇవే!
ప్రకటనల్లో కనిపించని అనేక రుసుములను బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు విధిస్తాయి. ఉదాహరణకు, ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25% నుండి 1% వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు మినహాయింపులు ఇచ్చినా, అవి పరిమిత కాలానికే ఉంటాయి. అంతేకాకుండా, టెక్నికల్ మరియు లీగల్ వెరిఫికేషన్ కోసం ₹5,000 నుండి ₹15,000 వరకు వసూలు చేస్తారు. డాక్యుమెంటేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ, మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా లోన్ తీసుకునేటప్పుడు అదనపు భారం అవుతాయి.
Key Facts Statement (KFS) కీలకం
రుణదాతల పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 'Key Facts Statement'ని తప్పనిసరి చేసింది. లోన్ అగ్రిమెంట్ పత్రాలపై సంతకం చేసే ముందే బ్యాంకర్లు దీనిని మీకు అందించాలి. ఇందులో మొత్తం లోన్ భారం, APR (Annual Percentage Rate) స్పష్టంగా ఉంటాయి. ఒకవేళ బ్యాంక్ ఈ పత్రాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తే, అది ఒక రెడ్ ఫ్లాగ్‌గా భావించాలి.
లాంగ్ టర్మ్ రిస్క్ మేనేజ్‌మెంట్
ఈఎంఐ (EMI) భారం తగ్గించుకోవడానికి సుదీర్ఘ కాల పరిమితిని ఎంచుకోవడం ఒక సాధారణ పొరపాటు. ఇది నెలనెలా ఈజీగా ఉన్నట్లు అనిపించినా, 20 లేదా 30 ఏళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం, మీ మొత్తం ఈఎంఐలు మీ ఇంటి ఆదాయంలో 50% మించకూడదు.
ప్రీ-పేమెంట్ రూల్స్
ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లపై ప్రీ-పేమెంట్ పెనాల్టీలను RBI నిషేధించింది. అయితే, ఫిక్స్‌డ్ రేట్ లేదా హైబ్రిడ్ లోన్లపై 4% వరకు జరిమానాలు పడే అవకాశం ఉంది. కాబట్టి, లోన్ అగ్రిమెంట్‌లో ఉన్న ఈ కండిషన్లను క్షుణ్ణంగా చదవడం చాలా అవసరం.
