కేంద్ర ప్రభుత్వం EPF వేజ్ సీలింగ్‌ను ప్రస్తుతమున్న ₹15,000 నుండి ₹25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17, 2026 నుండి అమల్లోకి రానున్న ఈ మార్పు వల్ల సుమారు 51 లక్షల మంది ఉద్యోగులకు సామాజిక భద్రత పెరగనుంది, అయితే టేక్-హోమ్ శాలరీలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది.
కీలక మార్పు.. 12 ఏళ్ల తర్వాత..
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న EPF వేజ్ సీలింగ్ పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2014 తర్వాత అంటే ఏకంగా 12 ఏళ్లకు ఈ నిబంధనలో మార్పులు చేశారు. గతంలో ఉన్న ₹15,000 పరిమితిని ₹25,000 కు పెంచారు. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 17, 2026 నుండి అమలులోకి వస్తుంది.
జీతంపై ఎంత ప్రభావం?
ప్రస్తుత నిబంధనల ప్రకారం, యజమాని మరియు ఉద్యోగి ఇద్దరూ కలిసి బేసిక్ జీతంలో 12% చొప్పున EPFకు కంట్రిబ్యూట్ చేస్తారు. పాత పరిమితి ప్రకారం ఇది గరిష్టంగా ₹1,800 ఉండేది. కొత్త నిబంధనతో ఇది ₹3,000 కి పెరుగుతుంది. దీనివల్ల బేసిక్ వేతనం ₹15,000 నుండి ₹25,000 మధ్య ఉన్న ఉద్యోగుల నెలవారీ టేక్-హోమ్ శాలరీలో ₹1,200 వరకు తగ్గుదల ఉంటుంది. ఇది ప్రస్తుత నగదు లభ్యతను తగ్గించినప్పటికీ, దీర్ఘకాలంలో రిటైర్మెంట్ ఫండ్ పెరగడానికి దోహదపడుతుంది.
కంపెనీలపై భారం
ఉద్యోగి కంట్రిబ్యూషన్ ఎంత ఉంటే, యజమాని (Employer) కూడా అంతే మొత్తాన్ని చెల్లించాలి. కాబట్టి తయారీ రంగం, రిటైల్, లాజిస్టిక్స్ మరియు హాస్పిటాలిటీ వంటి రంగాల్లోని కంపెనీలకు అదనపు వేతన భారం పడుతుంది. ఇది కంపెనీల Cost to Company (CTC) ని పెంచుతుంది, దీనివల్ల భవిష్యత్తులో కంపెనీలు తమ నియామక బడ్జెట్లను ఎలా ప్లాన్ చేస్తాయనేది కీలకంగా మారింది.
పెన్షన్ & భీమా (EPS & EDLI)
ఈ పెంపు వల్ల Employees’ Pension Scheme (EPS) లో జమ అయ్యే నిధులు కూడా పెరుగుతాయి. అలాగే, Employees’ Deposit Linked Insurance (EDLI) స్కీమ్ కింద లభించే గరిష్ట ప్రయోజనం ₹7 లక్షల పరిమితిలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ వచ్చే నెల జీతపు స్లిప్‌లలో (Salary Slip) ఈ కటింగ్స్ గమనించాల్సి ఉంటుంది.
