చాలామంది ఉద్యోగులకు తెలియని విషయం ఏంటంటే, ఉద్యోగం లేని గ్యాప్ సమయంలో వచ్చే ఈపీఎఫ్ (EPF) వడ్డీపై పన్ను పడుతుంది. ఈ ఆదాయం 'ఇన్ కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్' కిందకు వస్తుంది. పన్ను భారం తగ్గించుకోవడానికి ఈ రూల్స్ తెలుసుకోవడం చాలా అవసరం.
చాలామందికి ఈపీఎఫ్ (EPF) అనేది రిటైర్మెంట్ కోసం ఒక మంచి ట్యాక్స్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ అని మాత్రమే తెలుసు. అయితే, సాధారణంగా లభించే ఈ పన్ను మినహాయింపు కేవలం మీరు నిరంతరంగా కంట్రిబ్యూషన్లు చేస్తున్నప్పుడే వర్తిస్తుంది. మీరు ఉద్యోగం వదిలేసి, కొంతకాలం ఖాళీగా ఉన్నప్పుడు పరిస్థితి మారుతుంది.
వడ్డీపై పన్ను ఎప్పుడు పడుతుంది?
మీరు ఈపీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా కంట్రిబ్యూషన్లు చేయడం ఆపేసిన క్షణం నుండి, ఆ గ్యాప్ పీరియడ్‌లో వచ్చే వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం 'Income from Other Sources' గా పరిగణిస్తారు. మీరు మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరి కంట్రిబ్యూషన్లు ప్రారంభించే వరకు ఈ నిబంధన కొనసాగుతుంది.
ఖాతా స్టేటస్ - ఇనాక్టివ్ అకౌంట్
మీ ఖాతా 'టాక్సబుల్' ఆ లేక 'ఇనాక్టివ్' ఆ అనేది గమనించడం చాలా ముఖ్యం. 55 ఏళ్ల తర్వాత రిటైర్ అయితే, ఆ తర్వాత 36 నెలల వరకు వడ్డీ వస్తుంది. ఒకవేళ అంతకంటే ముందు రిటైర్ అయితే, 58 ఏళ్ల వయసు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుంది. ఆ గడువు దాటితే ఖాతా 'ఇనాక్టివ్'గా మారుతుంది, అంటే ఇకపై వడ్డీ రాదు.
ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి?
ఈ గ్యాప్ పీరియడ్ వడ్డీని చూపించడానికి రెండు మార్గాలు ఉన్నాయి:
- Receipt Basis: డబ్బులు విత్‌డ్రా చేసినప్పుడు మొత్తాన్ని చూపించడం. దీనివల్ల ఆ ఏడాది మీ ట్యాక్స్ స్లాబ్ పెరిగి, ఎక్కువ పన్ను కట్టాల్సి రావచ్చు.
- Accrual Basis: ప్రతి ఏటా వచ్చిన వడ్డీని ఆయా ఆర్థిక సంవత్సరాల్లోనే చూపించడం. ఇది కొంత శ్రమతో కూడుకున్నది అయినా, పన్ను భారాన్ని విభజించడానికి (Tax Efficiency) బాగా ఉపయోగపడుతుంది.
గతంలో మీరు ఈ వడ్డీని చూపించకపోతే, 'అప్‌డేటెడ్ ఐటీ రిటర్న్స్' (Updated ITR) ఫైల్ చేసి ఆ తప్పులను సరిదిద్దుకోవచ్చు.
