తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay పేరుతో ఏఐ (AI) సాయంతో ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రజలకు ఆర్థిక సాయం చేస్తామంటూ నమ్మిస్తూ వాట్సాప్ గ్రూపుల్లోకి ఆహ్వానిస్తున్నారు. దీని వెనుక విదేశీ హస్తం ఉన్నట్లు తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది.
ఏఐతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ముఠా
తమిళనాడు క్రైమ్ బ్రాంచ్-సీఐడీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సైబర్ మోసంపై దర్యాప్తు ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ముఖ్యమంత్రి C. Joseph Vijay లాగే కనిపించేలా, వినిపించేలా డీప్‌ఫేక్ వీడియోలను తయారు చేశారు. ఈ వీడియోలో హిందీ ఆడియోను వాడి, ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు ఆ సాయం పొందాలంటే వీడియోలో పేర్కొన్న నిర్దిష్ట వాట్సాప్ నంబర్లకు మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
విదేశాల నుంచే స్కామ్?
ప్రథమిక దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ఈ డీప్‌ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్న ఖాతాల ఆచూకీ పాకిస్థాన్ వంటి దేశాలకు చెందినట్లు గుర్తించారు. ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
Meta కి పోలీసుల నోటీసులు
ఈ వీడియోలను తొలగించాల్సిందిగా సోషల్ మీడియా దిగ్గజం Metaను పోలీసులు కోరారు. ఖాతాల వివరాలు, లాగ్ డేటాను అందించాల్సిందిగా పంపిన రిక్వెస్ట్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏఐ టెక్నాలజీతో జరుగుతున్న ఈ తరహా ఆర్థిక నేరాలు పెరిగిపోతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ముఖ్యంగా, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఇలాంటి అనుమానాస్పద వీడియోలను నమ్మవద్దని, వాట్సాప్ గ్రూపుల్లో చేరవద్దని తమిళనాడు పోలీసులు స్పష్టం చేశారు.
