ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఐదు అరుదైన ఒరాంగుటాన్లు లభ్యమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. ఇది అంతర్జాతీయ వన్యప్రాణి స్మగ్లింగ్ ముఠా పని అని అనుమానిస్తున్న అధికారులు, సీసీటీవీలో కనిపించిన నల్లని థార్ (Thar) కారు కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ జీవులను నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లో క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బిచిత్రాపూర్ ప్రాంతంలో ఐదు అరుదైన ఒరాంగుటాన్ పిల్లలు లభ్యమవ్వడం కలకలం రేపింది. ఇండోనేషియా, మలేషియా వర్షారణ్యాల్లో మాత్రమే కనిపించే ఈ జీవులు భారత్‌కు ఎలా వచ్చాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మరియు కేంద్ర వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) సంయుక్తంగా దర్యాప్తును వేగవంతం చేశాయి.\n\nఈ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అరుదైన జీవులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న భారీ ధర దృష్ట్యా, వీటిని ప్రైవేట్ కలెక్టర్లకు తరలించే ప్రయత్నం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ దందాలో సముద్ర మార్గాలను ఉపయోగిస్తున్నారా అనే కోణంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయంతో అధికారులు ఆరా తీస్తున్నారు.\n\nప్రస్తుతం సోమవారం రాత్రి సంఘటనా స్థలం వద్ద కనిపించిన ఒక నల్లని 'థార్' కారును ప్రధాన ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, కోస్టల్ చెక్‌పోస్టుల వద్ద ఉన్న ట్రాన్సిట్ డేటాను విశ్లేషిస్తున్నారు. అటు, స్వాధీనం చేసుకున్న 3 మగ, 2 ఆడ ఒరాంగుటాన్లు (వయస్సు 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు) ప్రస్తుతం భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లో నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాయి.\n\nఈ జీవులకు ప్రత్యేక క్వారంటైన్ ఫెసిలిటీలో ద్రవ రూపంలో ఉండే పోషకాహారం, పండ్లను అందిస్తున్నారు. వీటికి శాశ్వత నివాసం కల్పించేందుకు సెంట్రల్ జూ అథారిటీ నుండి అనుమతులు కోరే ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించడంపైనే ఇప్పుడు పూర్తి దృష్టి కేంద్రీకరించారు.
