WhatsAppలో వచ్చే నకిలీ బ్యాంకింగ్ అలర్ట్‌లతో జాగ్రత్త! మెసేజ్ చూసి పొరపాటున 'NO' అని రిప్లై ఇస్తే, మీ మొబైల్‌లోకి మాల్వేర్ ప్రవేశించి బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కొత్త తరహా సైబర్ దాడి!
హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అపరిచిత నంబర్ల నుంచి బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు డెబిట్ అయ్యాయని నకిలీ మెసేజ్‌లు పంపిస్తారు. ఆ మెసేజ్ చివరలో 'ఒకవేళ మీరు ఈ లావాదేవీ చేయకపోతే 'NO' అని రిప్లై ఇవ్వండి' అని ఉంటుంది. ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది.
ఎలా జరుగుతోంది?
సాధారణంగా ఫిషింగ్ లింక్స్ లేదా ఓటిపి (OTP) ద్వారా మోసాలు జరుగుతుంటాయి. కానీ, ఈ కొత్త పద్ధతిలో మీరు 'NO' అని రిప్లై ఇవ్వగానే, ఆ మెసేజ్ లోపల ఉన్న మాల్వేర్ స్క్రిప్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇది మీ ఫోన్‌లోని సెక్యూరిటీ వాల్స్‌ని దాటేసి, బ్యాంకింగ్ యాప్స్‌కు అనధికారికంగా యాక్సెస్ పొందుతుంది. ఫలితంగా మీ ఖాతాలోని సొమ్ము మొత్తం మాయమయ్యే అవకాశం ఉంది.
బ్యాంకుల నిబంధనలు ఏమిటి?
ఏ బ్యాంకు కూడా వాట్సాప్ ద్వారా ఇలాంటి లావాదేవీలను వెరిఫై చేసుకోదు. ఒకవేళ మీకు అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, మెసేజ్‌ను డిలీట్ చేయడం ఉత్తమం. ఏదైనా సమస్య ఉంటే అధికారిక బ్యాంకింగ్ యాప్స్ లేదా కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ ద్వారా మాత్రమే సంప్రదించండి.
మోసపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీరు పొరపాటున ఈ మాల్వేర్ బారిన పడితే, వెంటనే ఆలస్యం చేయకుండా నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి. మీరు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి డబ్బును కాపాడుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
