DGCA తన తాజా ఆదేశాల్లో MOBIKINS MK-PB-04 పవర్ బ్యాంక్‌పై నిషేధం విధించింది. ఇకపై దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఈ పరికరాన్ని అనుమతించరు. అక్టోబర్ 11, 2026న జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎందుకు ఈ నిషేధం?
విమానయాన భద్రతా సంస్థ DGCA, MOBIKINS MK-PB-04 పవర్ బ్యాంక్‌లను విమానాల్లో తీసుకువెళ్లడంపై తక్షణమే నిషేధం విధించింది. క్యాబిన్ బ్యాగేజీ, చెక్-ఇన్ లగేజీ లేదా కార్గో.. ఇలా ఏ రూపంలోనూ వీటిని అనుమతించబోమని స్పష్టం చేసింది.
అసలేం జరిగింది?
గత అక్టోబర్ 11, 2026న ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న IndiGo ఫ్లైట్ (6E 6115) లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగా, ఓ ప్రయాణికుడి బ్యాగులోని పవర్ బ్యాంక్ ఒక్కసారిగా మంటలు అంటుకుని నిప్పురవ్వలు రేపింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ఎయిర్‌లైన్స్‌కు కొత్త బాధ్యత
ఈ నిషేధం తర్వాత, ఎయిర్‌లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ మరియు సెక్యూరిటీ టీమ్స్ పై అదనపు బాధ్యత పడింది. ప్రీ-ఫ్లైట్ స్క్రీనింగ్ సమయంలో ప్రయాణికుల వద్ద ఈ మోడల్ పవర్ బ్యాంకులు లేకుండా చూడటం, ఒకవేళ కనిపిస్తే వాటిని జప్తు చేయడం ఇప్పుడు తప్పనిసరి.
లిథియం-అయాన్ బ్యాటరీల్లో తలెత్తే 'Thermal Runaway' (అధిక వేడి కారణంగా బ్యాటరీ పేలడం) ముప్పుపై ఇప్పటికే కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒక నిర్దిష్టమైన మోడల్‌నే టార్గెట్ చేస్తూ నిషేధం విధించడం, విమాన ప్రయాణాల్లో భద్రత విషయంలో DGCA ఎంత సీరియస్‌గా ఉందో తెలియజేస్తోంది.
