నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు?
మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (MNLU), నాగ్‌పూర్ క్యాంపస్‌లో 2025 విద్యా సంవత్సరానికి గానూ PhD అడ్మిషన్లలో పెద్ద కుంభకోణం బయటపడింది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (NCSC) ఈ విషయంపై సీరియస్ గా స్పందించి, యూనివర్సిటీపై విచారణకు ఆదేశించింది. నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన రిజర్వేషన్ కోటాను పక్కనపెట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు లేరనే కారణంతో అదనంగా 20 సీట్లను అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో భర్తీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ కేటగిరీలో కేవలం 12 సీట్లు మాత్రమే కేటాయించాల్సి ఉండగా, యూనివర్సిటీ యాజమాన్యం ఈ నిబంధనలను ఉల్లంఘించిందని తెలుస్తోంది. దీనిపై దీపక్ నాందేవ్ ఖరాట్ అనే అభ్యర్థి బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
వివాదాస్పద నిర్ణయం వెనుక అసలు కథ
యూనివర్సిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం, మొత్తం 35 సీట్లలో OBC, SC, SEBC, మరియు వివిధ సంచార జాతుల కేటగిరీలకు సీట్లు కేటాయించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ సీట్లను పెంచడం, అదే సమయంలో రిజర్వ్‌డ్ కేటగిరీలలోని కొన్ని సీట్లను ఖాళీగా వదిలేయడంపై NCSC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ కు కూడా నోటీసులు జారీ చేసినా, సరైన స్పందన లేదని సమాచారం. అడ్మిషన్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, నిబంధనలను పాటించడంలో యూనివర్సిటీ విఫలమైందని NCSC అభిప్రాయపడింది.
రిస్క్ లో యూనివర్సిటీ ప్రతిష్ట
ఈ వివాదం MNLU నాగ్‌పూర్ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించింది. ఒకవైపు చట్టపరమైన చర్యలు, మరోవైపు NCSC విచారణ.. దీంతో యూనివర్సిటీ భవిష్యత్ నిధుల కేటాయింపులు, అక్రిడిటేషన్ ప్రక్రియలు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు లేరని యూనివర్సిటీ చెబుతున్నప్పటికీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ వాదనను NCSC అంత తేలికగా అంగీకరించేలా లేదు. భవిష్యత్తులో ఈ కేసు విచారణ, యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియల్లో మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
