ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ట్యాక్స్ రీఫండ్ వడ్డీని నిలిపివేయడానికి వీల్లేదని Income-Tax Appellate Tribunal (ITAT) స్పష్టం చేసింది.
ముంబైకి చెందిన ITAT బెంచ్ పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చేలా ఈ తీర్పును వెలువరించింది. రిటర్న్స్ ఫైలింగ్‌లో పొరపాట్లు జరిగినంత మాత్రాన, ఆ కారణాన్ని చూపి పన్ను అధికారులు రీఫండ్‌పై వచ్చే వడ్డీని తిరస్కరించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఇది ముఖ్యంగా రీఫండ్ల కోసం ఎదురుచూసే వ్యాపారులు మరియు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట.
అసలు వివాదం ఏంటి?
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 244A ప్రకారం, రీఫండ్ ఆలస్యమైతే ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు వడ్డీని చెల్లించాలి. అయితే, ఫైలింగ్‌లో క్లాసిఫికేషన్ ఎర్రర్స్ ఉంటే అది పన్ను చెల్లింపుదారుల తప్పు అని, కాబట్టి వడ్డీ ఇచ్చేది లేదని అధికారులు గతంలో వాదించేవారు. దీన్ని తిప్పికొట్టిన ట్రిబ్యునల్, వడ్డీ అనేది ఒక స్టాట్యుటరీ హక్కు అని, పన్ను చెల్లింపుదారులు కావాలని ప్రక్రియను అడ్డుకుంటే తప్ప వడ్డీని నిలిపివేయకూడదని తేల్చి చెప్పింది.
అదనపు వడ్డీ ప్రయోజనం
సెక్షన్ 244A(1A) ప్రకారం, నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా రీఫండ్ జరిగితే, అదనంగా 3% వార్షిక వడ్డీని పొందే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది. ఒక కేసులో దాదాపు 2 ఏళ్ల ఆలస్యానికి గాను, అడ్మినిస్ట్రేటివ్ జాప్యంపై ఈ జరిమానాను కూడా ట్రిబ్యునల్ అమలు చేసింది.
గుర్తుంచుకోవాల్సిన విషయం
ఈ తీర్పు పన్ను చెల్లింపుదారులకు రక్షణ కల్పించినప్పటికీ, పన్ను అధికారులు అడిగిన వివరాలు ఇవ్వకుండా కావాలని విచారణను వాయిదా వేయడం వంటివి చేస్తే మాత్రం వడ్డీ లభించదు. అందుకే, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. మీ ఫైలింగ్స్, నోటీసులు మరియు వాటికి ఇచ్చే రిప్లైల రికార్డులను పక్కాగా దాచుకోవడం ఉత్తమం.
