Income Tax Appellate Tribunal (ITAT) Bangalore కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ స్థాయిలో అకౌంటింగ్ బుక్స్ లేవన్న కారణంతో రైతుల ఆదాయాన్ని తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ల్యాండ్ రికార్డులు, APMC సేల్ బిల్లులు ఉంటే చాలని కోర్టు పేర్కొంది.
ಬೆಂಗಳೂರು ITAT ఇటీవల ఇచ్చిన తీర్పు వ్యవసాయదారులకు పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదును 'అన్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్కమ్' (Unexplained Income) కింద పరిగణిస్తూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైతులపై ఆంక్షలు విధించడంపై ఈ విచారణ జరిగింది. Section 69A కింద ఈ నోటీసులు జారీ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అసలు వివాదం ఏంటి?
సాధారణంగా చిన్న రైతులు తమ పంటను APMC యార్డుల్లో అమ్ముతుంటారు. ఆ నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు, ఆదాయపు పన్ను అధికారులు 'ఖర్చుల వివరాలు ఎక్కడ?', 'కార్పొరేట్ తరహా అకౌంటింగ్ బుక్స్ ఎందుకు లేవు?' అని ప్రశ్నిస్తారు. సరైన లెక్కలు లేవన్న కారణంతో ఆ ఆదాయాన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్‌గా పరిగణిస్తారు. ఇది చిన్న రైతులకు పెద్ద తలనొప్పిగా మారింది.
ITAT ఏం చెప్పింది?
వ్యవసాయ రంగంలోని క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ITAT కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల నుంచి కార్పొరేట్ స్థాయి అకౌంటింగ్ ఆశించడం సరికాదని స్పష్టం చేసింది. RTC (Record of Rights, Tenancy and Crops) వంటి భూమి రికార్డులు మరియు APMC సేల్ బిల్లులు ఉన్నప్పుడు, ఆ ఆదాయం వ్యవసాయం నుంచే వచ్చిందని భావించాలని కోర్టు పేర్కొంది. అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు ఈ తీర్పు కళ్ళెం వేసింది.
రైతులకు ముఖ్య గమనిక
ఈ తీర్పు రైతులకు రక్షణ కల్పించినప్పటికీ, అన్ని డిపాజిట్లు ఆటోమేటిక్‌గా పన్ను మినహాయింపు పొందుతాయని అనుకోవద్దు. నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎప్పుడూ పన్ను చెల్లింపుదారుడిపైనే ఉంటుంది. కనీసం కనీస డాక్యుమెంటేషన్ (భూమి రికార్డులు, విక్రయ రశీదులు) మెయింటైన్ చేయడం తప్పనిసరి. మీరు వీటిని చూపించగలిగితేనే ఆదాయపు పన్ను విచారణల నుంచి సురక్షితంగా బయటపడగలరు.
