డిఫెన్స్ రంగంలో కీలకమైన AWEIL (Advanced Weapons and Equipment India Limited) సంస్థలో తీవ్రమైన ఆపరేషనల్, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడించింది. ఆర్మీ నుండి డిమాండ్ తగ్గడం, నాణ్యత లోపాలు, వృధాగా ఉన్న సామర్థ్యం వంటి అంశాలను ఈ నివేదిక హైలైట్ చేసింది. దీనితో తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి, దేశ భద్రతకు అవసరమైన సరఫరాలను మెరుగుపరచడానికి అత్యవసరమైన సంస్కరణలు అవసరమని కమిటీ సూచించింది.
ఆర్థిక నష్టాలు, ఖర్చుల నిర్వహణ
పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) తాజాగా AWEIL పై ఒక కీలక నివేదికను విడుదల చేసింది. ఈ ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలో లోతుగా పాతుకుపోయిన ఆపరేషనల్, ఫైనాన్షియల్ సమస్యలు భారతదేశ చిన్న ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు సరఫరా చేసే ఆయుధాల విశ్వసనీయతను ప్రభావితం చేస్తున్నాయని నివేదిక తేటతెల్లం చేసింది.
2023-24 నుండి 2025-26 మధ్య కాలంలో, కంపెనీ ₹234 కోట్ల మేర పేరుకుపోయిన నష్టాలను నమోదు చేసింది. దీనికి ముందు, 2015-16 నుండి 2019-20 మధ్య కాలంలో, 12 చిన్న ఆయుధాలకు సంబంధించి ₹366 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఓవర్‌హెడ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల, ఒక్కో యూనిట్ ఉత్పత్తి ఖర్చు చివరి ఇష్యూ ధరల కంటే గణనీయంగా పెరిగిందని, కార్పొరటైజేషన్ తర్వాత కూడా కంపెనీ ఆర్థిక మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని కమిటీ పేర్కొంది.
నాణ్యత నియంత్రణ, ఆపరేషనల్ అడ్డంకులు
నాణ్యత నియంత్రణ ప్రమాణాలపై నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఐదేళ్ల కాలంలో, భారత ఆర్మీ ఉపయోగించిన చిన్న ఆయుధాలకు సంబంధించిన 269 ప్రమాదాలకు తయారీ లోపాలు కారణమని తేలింది. బారెల్ బోరు చిప్-ఆఫ్‌లు, బ్రీచ్ బ్లాక్ వైఫల్యాలు వంటివి ఇందులో ఉన్నాయి. తుది తనిఖీల నుండి ఉత్పత్తి సమయంలోనే నాణ్యత తనిఖీలకు (in-process quality checks) మారాలని కమిటీ సూచించింది.
ఇక ఇన్వెంటరీ నిర్వహణ కూడా పెద్ద సవాలుగా మారింది. మార్చి 31, 2020 నాటికి, AWEIL నిర్వహిస్తున్న మూడు ఫ్యాక్టరీలలో ₹641 కోట్ల విలువైన స్టాక్ ఉంది, ఇది మొత్తం ఉత్పత్తి వ్యయంలో 72%.
డిమాండ్ గ్యాప్, వ్యూహాత్మక ప్రణాళిక
ఉత్పత్తి సంక్షోభానికి ప్రధాన కారణం సాయుధ దళాల నుండి స్థిరమైన డిమాండ్ లేకపోవడమే. 2015 నుండి 2020 మధ్య, ఆర్మీ కొనుగోళ్లు ఈ ఫ్యాక్టరీల మొత్తం ఇష్యూలలో కేవలం 10% మాత్రమే. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) నుండి వచ్చిన ఆర్డర్‌లపై ఎక్కువగా ఆధారపడటం, కానీ అవి కూడా పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సరిపోవడం లేదు.
రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) బహుళ-సంవత్సరాల, రోల్-ఆన్ డిమాండ్ ప్లాన్‌ను అమలు చేయాలని కమిటీ కోరింది. ఆదాయాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, AWEIL సివిల్ మార్కెట్ కోసం స్పోర్టింగ్ లేదా హంటింగ్ రైఫిళ్లను తయారు చేయడం, ప్రైవేట్ డిఫెన్స్ తయారీదారులకు కాంపోనెంట్లను సరఫరా చేయడం వంటి కొత్త అవకాశాలను చూడాలని నివేదిక సూచించింది. అలాగే, ప్రైవేట్ రంగంతో పోల్చుకొని తమ ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఈ సిఫార్సులకు ఎలా స్పందిస్తుందో, ఈ ఫ్యాక్టరీలు ఆధునిక రక్షణ అవసరాలను తీర్చగలవని నిర్ధారించడానికి ఎలాంటి సంస్కరణలు అమలు చేస్తాయో చూడాలి.
