ఫార్మా రంగందే కీలక పాత్ర
ఈ భారీ పెట్టుబడుల్లో భారత ఫార్మా దిగ్గజాలు ముందు వరుసలో నిలిచాయి. ఏకంగా $19.1 బిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఇందులో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్గానన్ & కో.ను $11.75 బిలియన్లకు కొనుగోలు చేసే ప్రణాళికతో అగ్రస్థానంలో ఉంది. ఇది మార్కెట్ విస్తరణ, ఏకీకరణకు సంకేతం. అరోబిందో ఫార్మా, బయోకాన్ గ్రూప్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, గ్రానూల్స్ ఇండియా, లుపిన్ లిమిటెడ్, పిరమల్ ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్ వంటి ప్రముఖ భారత ఫార్మా కంపెనీలు కూడా గణనీయమైన మొత్తాలను కేటాయిస్తున్నాయి. వీరి ప్రధాన లక్ష్యం.. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, పరిశోధన, అభివృద్ధి (R&D) కార్యకలాపాలకు చేయూతనివ్వడం, ఔషధాల కొరతను తీర్చేందుకు కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడం, అమెరికా ఆరోగ్య సంరక్షణ సరఫరా గొలుసును (Supply Chain) బలోపేతం చేయడం.
పారిశ్రామిక రంగం, తయారీ విస్తరణ
ఆరోగ్య సంరక్షణతో పాటు, భారతీయ పారిశ్రామిక సంస్థలు కూడా అమెరికాలో తమ ఉనికిని విస్తరిస్తున్నాయి. జేఎస్ డబ్ల్యూ స్టీల్ సంస్థ తన ఓహియో, టెక్సాస్ ప్లాంట్లలో ఆధునీకరణ ప్రాజెక్టుల కోసం $255 మిలియన్లు పెట్టుబడి పెట్టనుంది. మరోవైపు, 12 భారతీయ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు, విస్తరణల కోసం $1.1 బిలియన్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించాయి. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అభయ్ ఉద్యు గ్రూప్, ఐదు అమెరికా సైట్లలో $900 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టి, 1,500 అమెరికన్ ఉద్యోగాలను సృష్టించనుంది. జిందాల్ పైప్, జిందాల్ ట్యూబులర్ యూఎస్ఏ టెక్సాస్, మిస్సిస్సిప్పిలలో $87 మిలియన్లు పెట్టుబడి పెడుతున్నాయి. జీవో వెల్‌నెస్ అమెరికా కార్యకలాపాల కోసం $15 మిలియన్లు పెట్టుబడి పెడుతుండగా, పోలీహోస్ ఇంక్. అమెరికా నౌకా నిర్మాణ పరిశ్రమకు మద్దతుగా లాస్ ఏంజిల్స్‌లో $2 మిలియన్లు కేటాయిస్తోంది.
టెక్నాలజీ, ఇంధన రంగంలోనూ పెట్టుబడులు
భారతీయ పెట్టుబడులకు టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగం కూడా కీలక ఆకర్షణగా నిలుస్తోంది. ముంబైకి చెందిన స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలికాం మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు $100 మిలియన్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా సుమారు 500 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. టెక్‌డోమ్ సొల్యూషన్స్, రోషాయ్, అత్రి ఏఐ, కిస్‌ఫ్లో, సటోరిఎక్స్ఆర్ వంటి కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో $1.5 మిలియన్ల నుంచి $7.5 మిలియన్ల వరకు చిన్నవైనప్పటికీ ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి, దాదాపు 150 ఉద్యోగాలను సృష్టించనున్నాయి. ఇంధన రంగంలో, మాగ్నో ఇన్నోవేషన్ ల్యాబ్ తన అమెరికా కార్యకలాపాలను ప్రారంభించడానికి $2 మిలియన్లు పెట్టుబడి పెట్టనుంది.
అమెరికా-భారత్ వాణిజ్యానికి ఊతం
ఈ పెట్టుబడులన్నీ వేలాది అమెరికన్ ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, సరఫరా గొలుసులను బలోపేతం చేసి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయని అంచనా. అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఈ నిబద్ధతలు అమెరికా మార్కెట్ విదేశీ పెట్టుబడిదారులకు ఎంత ఆకర్షణీయంగా ఉందో తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. 2030 నాటికి అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో, న్యాయమైన, సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.
