ఔషధాలు, మెడికల్ పరికరాల దిగుమతి కోసం కొత్త ఎంట్రీ పాయింట్లను పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనివల్ల ఫార్మా కంపెనీలకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, సప్లై చైన్ మరింత వేగవంతం కానుంది.
ఔషధ రంగంలో సప్లై చైన్ ప్రక్రియను సరళీకృతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక అడుగు వేసింది. 1945 నాటి 'డ్రగ్స్ రూల్స్'లో రూల్ 43Aకి సవరణలు చేస్తూ, కొత్త ఎంట్రీ పాయింట్లను ప్రతిపాదించింది. ఆగస్టు 2026లో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఫార్మా కంపెనీలు కొన్ని పరిమిత ఎంట్రీ పాయింట్ల నుంచే దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల తయారీ కేంద్రాలకు సరుకును తరలించడానికి రవాణా వ్యయం అధికమవుతోంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టులు, సీ-పోర్టులు, మరియు ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలను (ICDs) అధికారిక గేట్‌వేలుగా గుర్తించనున్నారు.
ఎక్కడెక్కడ కొత్త గేట్‌వేలు రానున్నాయి?
హర్యానాలోని సోనిపట్, పియాలా, హర్సారు, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గుజరాత్‌లోని గాంధీధామ్, ముంద్రా, తెలంగాణలోని సనత్‌నగర్, తిమ్మాపూర్ వంటి ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని వైట్‌ఫీల్డ్, బొమ్మసంద్ర స్పెషల్ ఎకనామిక్ జోన్, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులను ఈ జాబితాలో చేర్చారు. ఈ నిర్ణయంతో తయారీ కేంద్రాలకు దగ్గరగా క్లియరెన్స్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్
ఈ మార్పు వల్ల లాజిస్టిక్ ఖర్చులు తగ్గినప్పటికీ, మందుల నాణ్యత విషయంలో సవాళ్లు ఉండవచ్చు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలకు సున్నితంగా ఉండే (Temperature-sensitive) మందులు, పరికరాలను హ్యాండిల్ చేయడానికి అవసరమైన కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కొత్త కేంద్రాల్లో ఎంతవరకు ఉందనేది కీలకమైన అంశం. అంతేకాకుండా, కొత్త ప్రదేశాల్లో ఇన్పెక్షన్ ప్రమాణాలు మరియు ప్రభుత్వ నిబంధనల అమలు ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
