Dr. Reddy's Laboratories కీలక ఒప్పందం చేసుకుంది. Takeda కంపెనీ తయారు చేసే డెంగ్యూ వ్యాక్సిన్ 'QDENGA' ను భారతదేశంలోని ప్రైవేట్ మార్కెట్లలో 2027 మొదటి అర్ధభాగం నుంచి పంపిణీ చేయనుంది.
భారతీయ ఫార్మా రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఫార్మా దిగ్గజం Dr. Reddy's Laboratories, అంతర్జాతీయ కంపెనీ Takeda తో ఒక ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం, డెంగ్యూను నివారించే 'QDENGA' వ్యాక్సిన్‌ను భారత్‌లో విక్రయించే బాధ్యతను Dr. Reddy's చేపడుతుంది.
ఆర్థిక పరమైన లాభం
ఈ డీల్ లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే.. Dr. Reddy's ఎటువంటి ముందస్తు చెల్లింపులు (Upfront Payments) లేదా మైల్‌స్టోన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల కంపెనీపై ఎటువంటి అదనపు ఆర్థిక భారం పడకుండానే, అత్యంత కీలకమైన వ్యాక్సిన్ విభాగంలోకి అడుగుపెట్టినట్లయ్యింది. భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్ సేల్స్ ద్వారా వచ్చే ఆదాయం కంపెనీకి బోనస్‌గా మారనుంది.
వ్యాక్సిన్ స్పెషాలిటీ ఏంటి?
భారతదేశంలో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో, ప్రజారోగ్య పరంగా ఇది చాలా కీలకమైన నిర్ణయం. QDENGA అనేది 4 రకాల డెంగ్యూ వైరస్ సెరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు ఇది సురక్షితమని ఇప్పటికే CDSCO ఆమోదం తెలిపింది. అయితే, దీనిని 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా తీసుకోవాల్సి ఉంటుంది.
ఇన్వెస్టర్లు గమనించాల్సినవి
2027 నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు, దీని ధర నిర్ణయం మరియు ప్రైవేట్ మార్కెట్‌లో డాక్టర్ల సిఫార్సులపై దీని విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే, భారతీయ మార్కెట్ లో పెరిగే అవగాహన మరియు కంపెనీ నిర్మించబోయే డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పైనే పెట్టుబడిదారుల కన్ను ఉండాలి.
