అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు (Crude Oil) ధరల ప్రభావంతో Nayara Energy తన అవుట్‌లెట్లలో ఇంధన ధరలను పెంచింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల పెట్రోల్ బంకులకు, ప్రైవేట్ బంకులకు మధ్య ధరల వ్యత్యాసం భారీగా పెరిగింది.
దేశవ్యాప్తంగా తన 7,100 పైగా రిటైల్ అవుట్‌లెట్లలో Nayara Energy ఇంధన ధరలను సవరించింది. ముడి చమురు ధరలు గ్లోబల్ మార్కెట్‌లో పైపైకి వెళ్తుండటంతో, కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ బంకులతో పోలిక..
Indian Oil Corporation, Bharat Petroleum Corporation, మరియు Hindustan Petroleum Corporation వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. కానీ ప్రైవేట్ రిటైలర్లకు ఆ వెసులుబాటు లేదు. మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు ధరలను సర్దుబాటు చేయకపోతే వ్యాపారం నిర్వహించడం కష్టమవుతుంది.
కస్టమర్ల దారి ఎటు?
ఇంధన వ్యాపారంలో ధర తక్కువగా ఉన్న చోటకే కస్టమర్లు వెళ్లడం సహజం. ఇప్పుడు Nayara బంకుల్లో ధరలు పెరగడంతో, వాహనదారులు ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. దీనివల్ల Nayara సేల్స్ వాల్యూమ్స్ పడిపోయే ఛాన్స్ ఉందని మార్కెట్ అనలిస్టులు భావిస్తున్నారు.
నిరంతరం సవాళ్లు..
ముడి చమురు ధరలు పెరిగినప్పుడు లాభాల మార్జిన్లు దెబ్బతినడం ప్రైవేట్ సంస్థలకు అతిపెద్ద సమస్య. ప్రభుత్వం కూడా ప్రైవేట్ బంకులు అమ్మకాలను ఆపకూడదని నిబంధనలు విధిస్తుండటంతో, కంపెనీలు అటు లాభాలను కాపాడుకుంటూ, ఇటు సరఫరాను మెయింటైన్ చేయాల్సిన ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. ఇకపై ఇతర ప్రైవేట్ రిటైలర్లు కూడా బాటలో నడుస్తారా లేదా అనేది చూడాలి.
