సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ పరికరాలపై చైనా ప్రభుత్వం కొత్తగా ఎగుమతి ఆంక్షలను ప్రతిపాదించింది. దీనివల్ల 2028 నాటికి భారత్ పెట్టుకున్న 'లోకల్ సోలార్ ప్రొడక్షన్' లక్ష్యాలకు గండి పడే అవకాశం కనిపిస్తోంది.
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించిన 12 అధునాతన సాంకేతికతలపై ఎగుమతి ఆంక్షలను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా సోలార్ సెల్స్ తయారీకి వాడే మిషనరీపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. ఇది భారతీయ కంపెనీల సోలార్ సప్లై చైన్ ప్రయత్నాలకు పెద్ద సవాలుగా మారింది.
ఇంగట్ (Ingot) తయారీకి ఆటంకం
ప్రస్తుతం ఉన్న సోలార్ ప్లాంట్లకు తక్షణ ముప్పు లేకపోయినా, భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీ పరికరాల సేకరణ కష్టతరం కానుంది. సోలార్ వేఫర్ల తయారీకి పునాది అయిన 'ఇంగట్స్' తయారీ యంత్రాల కోసం ప్రపంచమంతా చైనాపైనే ఆధారపడుతోంది. భారత్ సొంతంగా వేఫర్లను తయారు చేయాలంటే ఈ మిషనరీ తప్పనిసరి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో వీటి లభ్యత చాలా తక్కువగా ఉంది.
2028 డెడ్‌లైన్‌పై ఒత్తిడి
భారత ప్రభుత్వ 'మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ' నిబంధనల ప్రకారం.. 2028 ఫిబ్రవరి నాటికి సోలార్ ప్రాజెక్టులు తప్పనిసరిగా దేశీయంగా తయారైన ఇంగట్స్, వేఫర్లను వాడాలి. ఇప్పుడు చైనా ఆంక్షల వల్ల, భారతీయ కంపెనీలు జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ మరియు అమెరికా వంటి దేశాల నుంచి ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దీనివల్ల క్యాపిటల్ ఖర్చు పెరగడంతో పాటు ప్రాజెక్టులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.
ఇన్వెస్టర్ల కోసం కీలక సూచనలు
భారతీయ కంపెనీలు వర్టికల్ ఇంటిగ్రేషన్ (Vertical Integration) వైపు వెళ్లాలని చూస్తున్న తరుణంలో ఈ ఆంక్షలు మార్జిన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కంపెనీలు తమ అప్పులను పెంచుకోకుండా ఈ సప్లై చైన్ సమస్యలను ఎలా అధిగమిస్తాయనేది చూడాలి. సోలార్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే వారు కంపెనీల మిషనరీ సేకరణ వ్యూహాలను గమనిస్తూ ఉండడం చాలా అవసరం.
