మోసగాళ్ల వలలో పడకండి!
బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCs) వద్ద ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని నమ్మించి, అప్పు తీసుకున్న వారిని మోసం చేసే స్కీమ్‌లు ఇటీవల పెరిగిపోయాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ స్కీమ్‌ల ద్వారా, మోసగాళ్లు నకిలీ 'రుణ మాఫీ సర్టిఫికెట్లు' (Debt Waiver Certificates) జారీ చేస్తూ, సర్వీస్ లేదా లీగల్ చార్జీల పేరుతో అమాయకులైన అప్పు తీసుకున్నవారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు.
క్రెడిట్ సిస్టమ్‌కు ముప్పు
ఇటువంటి మోసపూరిత ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, దేశంలోని క్రెడిట్ సిస్టమ్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని RBI తెలిపింది. ఈ చర్యలు అన్నీ అవాస్తవమని, చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని కేంద్ర బ్యాంకు హెచ్చరించింది. ఈ మోసగాళ్లతో వ్యవహరించడం వల్ల నేరుగా ఆర్థిక నష్టమే కాకుండా, ఆర్థిక సంస్థలు బలహీనపడతాయని, డిపాజిటర్లకు కూడా నష్టం వాటిల్లుతుందని RBI హెచ్చరిస్తోంది. గత ఏడాది కూడా ఇటువంటి అనధికారిక 'రుణ మాఫీ సర్టిఫికెట్ల' విషయంలో RBI ఇలాంటి హెచ్చరికనే జారీ చేసింది.
మీ రుణదాతలను నేరుగా సంప్రదించండి
అప్పులకు సంబంధించిన అన్ని విషయాల కోసం, ప్రజలు తమ రుణదాతలను (Lenders) నేరుగా సంప్రదించాలని RBI గట్టిగా సూచిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకునే ఈ మోసాలకు గురికాకుండా, సరైన సమాచారం పొందడానికి ఇదే మార్గమని RBI పేర్కొంది.
