ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. US Federal Reserve, Bank of Japan బాటలోనే ఇప్పుడు Reserve Bank of India (RBI) కూడా నడిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్ల పెంపు ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ద్రవ్యోల్బణం సవాలుగా మారింది. దీనిని అదుపు చేసేందుకు అమెరికాకు చెందిన US Federal Reserve మరియు Bank of Japan ఇప్పటికే రేట్ల పెంపును మొదలుపెట్టాయి. ఈ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
RBI నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
వచ్చే పాలసీ సమావేశంలో RBI రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా నిత్యావసరాలు, ఇంధన ధరల పెంపుతో సామాన్యుడిపై భారం పెరుగుతోంది. సిస్టమ్ నుండి అదనపు నగదును తగ్గించేందుకు బాండ్ అమ్మకాలు చేపడుతున్న RBI, ఇప్పుడు రేట్ల పెంపుతోనే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయగలమని భావిస్తోంది.
ఇన్వెస్టర్లపై ప్రభావం
ఈ మార్పులు ఇన్వెస్టర్ల జేబుపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే మన దేశంలో 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్ 7% మార్కును దాటేశాయి. వడ్డీ రేట్లు పెరిగితే కంపెనీలకు రుణాలు భారం అవుతాయి, తద్వారా వాటి ప్రాఫిట్ మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, బాండ్ల నుంచి మంచి రిటర్న్స్ అందుతుండటంతో, ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి కొంత దూరం జరిగే అవకాశం ఉంది. అలాగే రూపాయి విలువలో ఒడిదుడుకులు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు మార్కెట్‌ను మరింత ప్రభావితం చేయనున్నాయి.
