దేశీయంగా బలమైన వృద్ధి: RBI అంచనాల్లో పెరుగుదల
భారత ఆర్థిక వ్యవస్థ రాబోయే FY27 ఆర్థిక సంవత్సరంలో మరింత బలోపేతం అవుతుందని RBI అంచనా వేస్తోంది. ఆర్థిక సంవత్సరం 2027 మొదటి త్రైమాసికం (Q1 FY27) లో GDP వృద్ధి రేటును 6.9% కి, రెండో త్రైమాసికం (Q2 FY27) లో 7.0% కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది గతంలో అంచనా వేసిన 6.7% మరియు 6.8% కంటే ఎక్కువ. గ్లోబల్ గా ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ, దేశీయంగా బలమైన డిమాండ్, సేవల రంగంలో పురోగతి, ప్రభుత్వ మూలధన వ్యయం మరియు మెరుగైన వ్యవసాయ అవకాశాలు ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ నేపథ్యంలో, RBI కీలక రెపో రేటును (Repo Rate) 5.25% వద్ద యథాతథంగా కొనసాగిస్తూ, మానిటరీ పాలసీని న్యూట్రల్ గా ఉంచింది.
ద్రవ్యోల్బణం పై ప్రభావం: బంగారం ధరలే కీలకం
వృద్ధి అంచనాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం (CPI Inflation) పై RBI తన అంచనాలను స్వల్పంగా పెంచింది. FY26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి CPI ద్రవ్యోల్బణం అంచనాను 2.0% నుంచి 2.1% కి సవరించింది. ముఖ్యంగా, 2026 నాలుగో త్రైమాసికం (Q4 FY26) అంచనా 2.9% నుంచి 3.2% కి పెరిగింది. FY27 మొదటి త్రైమాసికానికి (Q1 FY27) ద్రవ్యోల్బణం 4.0% గా, రెండో త్రైమాసికానికి (Q2 FY27) 4.2% గా అంచనా వేసింది. ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం బంగారం (Precious Metals) ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల అని RBI స్పష్టం చేసింది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం అంచనాలకు సుమారు 60-70 బేసిస్ పాయింట్లు దోహదం చేస్తున్నాయి. అయితే, బంగారం, ఇంధనం వంటి వాటిని మినహాయిస్తే, మిగతా అంశాలలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, లక్షిత స్థాయికి దగ్గరగానే ఉందని RBI పేర్కొంది.