కేంద్ర ప్రభుత్వ Mobile Manufacturing PLI స్కీమ్ సక్సెస్ అయ్యింది. ఇప్పటివరకు రూ. 19,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తే, దానికి బదులుగా ఏకంగా రూ. 25,000 కోట్ల టాక్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇకపై అసెంబ్లింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్‌కు మారుతూ 2026 నుంచి కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ మొబైల్ తయారీ రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద తయారీదారులకు ₹19,000 కోట్లు ఇన్సెంటివ్స్‌గా అందజేయగా, ప్రభుత్వం ఏకంగా ₹25,000 కోట్ల డైరెక్ట్ టాక్స్‌లను రాబట్టింది. వీటితో పాటు GST రూపంలో అదనంగా ₹3,000 కోట్లు ఖజానాకు చేరాయి.
ఉపాధి కల్పనలో దూకుడు
ఈ పథకం కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాలేదు. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనే 12 లక్షల మందికి ఉపాధి దొరికింది. మొత్తంగా ఎలక్ట్రానిక్స్ రంగం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 25 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించడంలో ఈ స్కీమ్ కీలక పాత్ర పోషించింది.
2026 నుంచి కొత్త వ్యూహం
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ₹62,500 కోట్ల బడ్జెట్‌తో 'మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్'ను ప్రకటించింది. ఇది 2026-27 నుంచి 2030-31 వరకు అమలులో ఉంటుంది. ఈ కొత్త దశలో కేవలం ఫోన్లను అసెంబ్లీ చేయడం కాకుండా, విడిభాగాలను కూడా ఇక్కడే తయారు చేయడంపై (Local Value Addition) ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం 2.25% నుంచి 5% వరకు ఇన్సెంటివ్స్‌తో పాటు, స్థానిక R&D కోసం అదనంగా 1.5% ప్రోత్సాహకాన్ని అందిస్తారు.
ఇన్వెస్టర్లకు సూచన
ప్రస్తుత దశలో ఇండియా ఒక అసెంబ్లింగ్ హబ్‌గా ఎదిగింది. కానీ, కంపెనీలు ఇప్పటికీ విడిభాగాల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. దీనివల్ల కరెన్సీ హెచ్చుతగ్గుల రిస్క్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ కంపెనీలు తమ విడిభాగాలను స్థానికంగా తయారు చేస్తూ, సప్లై చైన్‌ను బలోపేతం చేసుకుంటాయో వాటికి లాభాల మార్జిన్లు మెరుగుపడే అవకాశం ఉంది.
