డిజిటల్ మార్కెట్ లో నకిలీల ప్రవాహం
భారతదేశంలో పెరుగుతున్న ఇ-కామర్స్ రంగం, నకిలీ వ్యాపారులకు స్వర్గధామంగా మారింది. వినియోగదారులు గతేడాది కొనుగోలు చేసిన వాటిలో దాదాపు 35% నకిలీ ఉత్పత్తులేనని నివేదిక చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది ఆన్‌లైన్ వేదికలు, సోషల్ మీడియా ద్వారానే ఈ నకిలీ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నకిలీలను అమ్మడం వల్ల, అధికారిక తనిఖీలను సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. ఈ పరిణామం ఔషధాలు, ఆటో విడిభాగాలు వంటి కీలక రంగాలలో తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోంది.
ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిన నకిలీ వ్యాపారం
నకిలీ వస్తువుల దందా భారతదేశ మొత్తం వాణిజ్యంలో దాదాపు 12% నుండి 15% వరకు ఉంది. ఇది ఏటా సుమారు 25% చొప్పున వేగంగా పెరుగుతోంది. ఈ అక్రమ వ్యాపారం అధికారిక ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బును మళ్లిస్తూ, చట్టబద్ధమైన వ్యాపారాల ఆదాయాన్ని, ఉద్యోగాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా, ఔషధ రంగం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. మార్కెట్లో లభించే వాటిలో దాదాపు 10-12% నకిలీ మందులే ఉండటం ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది.
ఏయే రంగాల్లో నకిలీల ప్రభావం?
దుస్తుల రంగంలో 31%, FMCG ఉత్పత్తులు, ఆటో విడి భాగాలు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ రంగంలో కూడా నకిలీల ప్రభావం తీవ్రంగా ఉంది. నకిలీ వ్యవసాయ ఉత్పత్తులు పంట దిగుబడులను తగ్గించి, రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. వినియోగదారుల అవగాహన పెరుగుతున్నప్పటికీ, తక్కువ ధరలకు లభించే నకిలీ వస్తువుల పట్ల ఆకర్షితులవడం, అమ్మకందారులు సరిగా తనిఖీ చేయకపోవడం వంటి కారణాలతో ఈ అక్రమ వ్యాపారం ఆగడం లేదు.
పోరాటానికి సవాళ్లు.. పరిష్కారాలు?
నకిలీ వ్యాపారుల అధునాతన పద్ధతులు, మారుతున్న వినియోగదారుల అలవాట్లు, నిఘా సంస్థల వనరుల కొరత ఈ వ్యాపారాన్ని అరికట్టడంలో ప్రధాన సవాళ్లుగా మారాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావడంతో పాటు, తయారీదారులు, అమ్మకందారులు, వినియోగదారులందరూ కలిసికట్టుగా పనిచేయాలి. బ్లాక్‌చెయిన్, QR కోడ్‌లు వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సరఫరా గొలుసులో పారదర్శకతను పెంచి, వినియోగదారులు ఉత్పత్తులను ధృవీకరించుకునే అవకాశం కల్పించాలి. నకిలీ వ్యాపారుల తీరు మారుతున్న కొద్దీ, అన్ని వర్గాలు అప్రమత్తంగా ఉంటూ, తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.