మార్చిలో ద్రవ్యోల్బణం అదుపులోనే...
గత నెలలో భారతదేశంలో వినియోగదారుల ధరల సూచీ (CPI) కేవలం 0.26% మాత్రమే పెరిగింది. ఇది జనవరిలో నమోదైన పెరుగుదల కంటే కూడా తక్కువ. అంటే, చాలా వస్తువులు, సేవల ధరల్లో పెద్దగా మార్పులేవీ రాలేదు. ముఖ్యంగా ఆహారం, దుస్తులు, ఆరోగ్యం, రవాణా సేవల ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఇంధన ధరలు మాత్రం భారీగా పెరిగాయి!
అయితే, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ పరిస్థితుల (Geopolitical Tensions) వల్ల ఇంధన ధరలు మాత్రం చుక్కలనంటుతున్నాయి. గృహ, విద్యుత్, ఇంధన విభాగం ధరలు మొత్తం 0.6% పెరిగాయి. ఇందులో ఎల్‌పీజీ, పైప్‌డ్ నేచురల్ గ్యాస్ ధరలు ఏకంగా 3.61% మేర పెరగడమే ప్రధాన కారణం. లిక్విడ్ ఫ్యూయల్స్ (పెట్రోల్, డీజిల్) ధరలు కూడా నెలవారీగా 1.56% పెరిగాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలను అదుపు చేయడానికి ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నా ఈ ధరల పెరుగుదల కనిపించింది.
ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం ఉంటుందా?
విశ్లేషకుల అంచనాల ప్రకారం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) సమీపంలో ఉద్రిక్తతలు కొనసాగితే, ఈ అధిక ఇంధన ధరలు భారత ఆర్థిక వ్యవస్థలో త్వరలోనే వ్యాపించవచ్చు. వ్యవసాయం, రసాయనాలు, ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్ వంటి పరిశ్రమలకు నిర్వహణ ఖర్చులు (Operating Costs) పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు, రవాణా ఖర్చులు పెరిగి, చాలా ఉత్పత్తుల ధరలు పెరిగి, మొత్తం ద్రవ్యోల్బణం పెరిగి, వినియోగదారుల కొనుగోలు శక్తి (Spending Power) తగ్గే ప్రమాదం ఉంది.