కర్బన ఉద్గారాలను తగ్గించాలంటే, పునరుత్పాదక ఇంధన వనరులను (Renewables) , ట్రాన్స్‌మిషన్ లైన్లను వేగంగా విస్తరించాలి. కానీ, భూసేకరణ సమస్యలు, నిధుల లభ్యత, నియంత్రణపరమైన అడ్డంకులు (Regulatory Hurdles) దీని పురోగతిని నెమ్మదిస్తున్నాయి.
విధానాల్లో స్పష్టతపై ప్రశ్నలు
కార్బన్ సింక్‌లను (Carbon Sink) పెంచడానికి అడవుల పెంపకం (Afforestation) వంటి భూ ఆధారిత ప్రాజెక్టులు అవసరం. అయితే, ఈ భూములను తరచుగా ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మళ్లించడం విధానాల్లో స్థిరత్వంపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఉదాహరణకు, గ్రేట్ నికోబార్ దీవుల్లోనే 13,000 హెక్టార్లకు పైగా అటవీ భూమిని ప్రాజెక్టుల కోసం కేటాయించారు. అంతేకాకుండా, భారతదేశం తన కొత్త జాతీయ నిర్ధారిత సహకారం (NDC)లో, వివిధ రంగాలు ఈ ఉద్గారాలను ఎలా తగ్గిస్తాయో స్పష్టమైన ప్రణాళికలను (Roadmaps) చేర్చలేదు. దీంతో భారీ పరిశ్రమలు, రవాణా రంగాల నుంచి వచ్చే ఉద్గారాలను ఎలా నియంత్రిస్తారనే దానిపై అనిశ్చితి నెలకొంది.
బొగ్గుపై ఆధారపడటం, నిధుల అంతరాలు
తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చడానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని పెంచడం, పునరుత్పాదక ఇంధన రంగంలో పురోగతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. భారత్ 2034-35 నాటికి 97,000 మెగావాట్ల కొత్త బొగ్గు, లిగ్నైట్ థర్మల్ సామర్థ్యాన్ని జోడించాలని యోచిస్తోంది. దీనికి భారీగా నిధులు అవసరం. కానీ దేశీయ బడ్జెట్ పరిమితులు, అంతర్జాతీయ వాతావరణ నిధుల (International Climate Funds) అనిశ్చితి అమలులో సంక్లిష్టతలను పెంచుతున్నాయి. ఆర్థిక వృద్ధిని, డీకార్బనైజేషన్‌ను సమతుల్యం చేసే ఈ ప్రయత్నం సంస్థాగత సామర్థ్యాలపై ఒత్తిడి తెస్తుంది. భారతదేశం నిర్దేశించుకున్న వాతావరణ లక్ష్యాలు దాని ఉద్దేశాన్ని సూచిస్తున్నప్పటికీ, విజయం స్పష్టమైన పర్యవేక్షణ, సాధించగల కాలపరిమితులు, వాస్తవిక ప్రణాళికలను అమలు చేయడంలో క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. రాజకీయ నిబద్ధత స్థిరత్వం కూడా ఒక ఆందోళనకరమైన అంశంగానే మిగిలిపోయింది.