US మందగమనం.. అయినా నిలబడ్డ ఎగుమతులు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025 - జనవరి 2026) భారతదేశ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మొత్తం $23.19 బిలియన్ మార్క్ వద్ద స్థిరంగా నిలిచాయి. డాలర్లలో చూస్తే ఇది గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా 0.64% తగ్గినప్పటికీ, రూపాయిలలో చూస్తే 3.57% పెరిగినట్టు లెక్క. ఈ స్థిరత్వానికి ప్రధాన కారణం.. అమెరికా మార్కెట్ లో భారీ పతనం.
ఎక్కడా తగ్గని దూకుడు!
అమెరికాకు ఎగుమతులు భారీగా 45% పడిపోయినా, భారత ఎగుమతిదారులు ఇతర మార్కెట్లలో తమ సత్తా చాటారు. ముఖ్యంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు ఎగుమతులు 23.7% పెరిగాయి. అలాగే, హాంకాంగ్ మార్కెట్ లో 33.5%, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మార్కెట్లలో 36% చొప్పున వృద్ధి నమోదైంది. బెల్జియం, థాయిలాండ్, ఇజ్రాయెల్ వంటి దేశాలూ డబుల్ డిజిట్ గ్రోత్ తో తోడ్పడ్డాయి. ఈ భౌగోళిక విస్తరణ (Geographical Diversification) ఒక్క మార్కెట్ పై ఆధారపడటాన్ని తగ్గించింది.
డైమండ్స్ కి డౌన్.. జ్యువెలరీకి అప్!
రత్నాలు, ఆభరణాల విభాగంలో పనితీరు మిశ్రమంగా ఉంది.
కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్: వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం, ల్యాబ్-గ్రూన్ డైమండ్స్ (LGDs) నుంచి పోటీ పెరగడంతో వీటి ఎగుమతులు 7.46% తగ్గి $9.97 బిలియన్ కి చేరాయి.
ల్యాబ్-గ్రూన్ డైమండ్స్ (LGDs): ప్రపంచవ్యాప్తంగా ధరలు పడిపోవడంతో, వీటి విలువ 9.73% తగ్గి $923.62 మిలియన్ కి చేరింది. అతిగా ఉత్పత్తి అవ్వడం, ధరల పతనం కస్టమర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
గోల్డ్ జ్యువెలరీ: వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీ అమ్మకాలు పెరిగాయి. మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులు 5.53% పెరిగి $9.71 బిలియన్ కి చేరాయి.
సిల్వర్ జ్యువెలరీ: అంతర్జాతీయంగా బలమైన డిమాండ్, బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో ఇది 'అఫర్డబుల్ లగ్జరీ'గా మారింది. దీని ఎగుమతులు ఏకంగా 51.21% పెరిగి $1.28 బిలియన్ కి చేరాయి.
ప్లాటినం జ్యువెలరీ: దీని ఎగుమతులు 49.09% పెరిగి $215.15 మిలియన్ కి చేరుకున్నాయి.
వ్యూహాత్మక ప్రణాళికలు & భవిష్యత్ ఆశలు
ప్రస్తుతం ప్రపంచ డైమండ్ ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ రంగం కోలుకోవడానికి ఇండియా-యూఎస్ మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం (Trade Framework) కీలక పాత్ర పోషించనుంది. దీని ద్వారా సుంకాల తగ్గింపు, ముఖ్యంగా డైమండ్స్ పై సున్నా డ్యూటీ అమలు చేస్తే, ఎగుమతులు $3 బిలియన్ వరకు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో, 2047 నాటికి రత్నాలు, ఆభరణాల ఎగుమతులను $100 బిలియన్ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పరిశ్రమ ముందుకు సాగుతోంది.