బడ్జెట్ 2026 లో ప్రవేశపెట్టిన ఈ పన్ను సంస్కరణలు, పన్ను చెల్లింపుదారుల వ్యవహార శైలిని సమూలంగా మార్చనున్నాయి. గతంలో చిన్న చిన్న సాంకేతిక లోపాలు కూడా తీవ్ర చట్టపరమైన సమస్యలకు, క్రిమినల్ కేసులకు దారితీసేవి. ఇకపై అలాంటి భయం ఉండదని, ప్రొసీజర్లలోని చిన్న లోపాలకు వెంటనే శిక్షలు కాకుండా, సరిదిద్దే ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తారు.
నిబంధనల కఠినత్వం తగ్గుతుందా?
ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యం.. పెనాల్టీల భారం తగ్గించి, దిద్దుబాటుకే ప్రాధాన్యత ఇవ్వడం. దీనివల్ల ERP మైగ్రేషన్స్ లేదా సిబ్బంది మార్పుల వల్ల డాక్యుమెంట్లు సమర్పించడంలో ఆలస్యం వంటి అనుకోని పొరపాట్లు క్రిమినల్ చర్యలకు దారితీయవని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 446, 447, 454 వంటివి (కొత్త చట్టం 2025 ప్రకారం) ఇప్పుడు మార్పులకు లోనవుతున్నాయి. గతంలో పన్ను చెల్లించినా, చెల్లించకపోయినా.. ఆలస్యానికి కఠినమైన పెనాల్టీలు విధించేవారు. ఇకపై వీటి స్థానంలో, ఆలస్యం జరిగిన సమయాన్ని బట్టి నిర్దిష్ట, గ్రేడెడ్ ఫీజులు వర్తిస్తాయి. నోటీసు తర్వాత కూడా డిఫాల్ట్ కొనసాగితే, లావాదేవీల స్టేట్‌మెంట్లు ఆలస్యంగా సమర్పించినందుకు గరిష్టంగా ₹1 లక్ష వరకు ఫీజులు ఉండవచ్చు. అయితే, నిజమైన పొరపాట్లకు, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసేవారికి మధ్య తేడాను స్పష్టంగా చూపడం, గ్రేడెడ్ ఫీజులను సరిగ్గా అమర్చడం ప్రభుత్వానికి పెద్ద సవాలు. ఇది భవిష్యత్తులో రెవెన్యూ సేకరణపై ప్రభావం చూపవచ్చు.
అంతర్జాతీయ పోలికలు, పెట్టుబడులపై ప్రభావం
ఇలాంటి సంస్కరణలు సింగపూర్, న్యూజిలాండ్ వంటి దేశాలలో అమలు చేస్తే, పన్నుల విధానం సరళీకృతం అయి, వ్యాపారాలు మెరుగుపడినట్లు కనిపించింది. అయితే, కొన్ని దేశాల్లో తాత్కాలికంగా రెవెన్యూ తగ్గిందని కూడా నివేదికలున్నాయి. భారత ప్రభుత్వం సెక్షన్ 481 కింద కొన్ని తప్పిదాలను డీక్రిమినలైజ్ చేయడం, పైన చెప్పిన సెక్షన్లను ఏప్రిల్ 1, 2026 నుండి గ్రేడెడ్ ఫీజులతో భర్తీ చేయడం.. ఈ అంతర్జాతీయ ధోరణులను ప్రతిబింబిస్తుంది. దీనివల్ల వ్యాపార వాతావరణం మరింత ఊహించదగినదిగా (predictable) మారుతుందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, నిజమైన అడ్డంకులను, ఉద్దేశపూర్వక ఎగవేతను ఎలా వేరు చేస్తారనేది ఆచరణలో చూడాలి.
భవిష్యత్తు అంచనాలు
మొత్తానికి, ఈ సంస్కరణలు పన్ను చెల్లింపుదారులకు, ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పెంచుతాయని, నిజాయితీపరులపై భారం తగ్గుతుందని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని దీర్ఘకాలిక ఫలితాలు.. కొత్త ఫీజుల అమలు, ఉద్దేశపూర్వక తప్పులకు, నిజమైన పొరపాట్లకు మధ్య స్పష్టమైన విభజనపై ఆధారపడి ఉంటాయి. ఈ సంస్కరణలు అనుకున్నట్లుగా స్వచ్ఛందంగా పన్ను చెల్లింపును ప్రోత్సహిస్తే, రెవెన్యూలో స్థిరత్వం వచ్చి, ఆర్థిక వ్యవస్థ మరింత చురుగ్గా మారుతుంది. లేదంటే, భవిష్యత్తులో మార్పులు చేయాల్సి రావచ్చు.
