US ఫెడరల్ రిజర్వ్ విడుదల చేసిన 'Beige Book' నివేదిక అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని స్పష్టం చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్తంభించిన నియామకాలు భారతీయ మార్కెట్లపై, ముఖ్యంగా IT రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమనం స్పష్టంగా కనిపిస్తోంది. ఫెడరల్ రిజర్వ్ తాజా 'Beige Book' నివేదిక ప్రకారం, దేశంలోని 12 రీజియన్లలో కేవలం 9 చోట్ల మాత్రమే వృద్ధి నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. అమెరికాలో పెరుగుతున్న ఖర్చులు, అనిశ్చితి వ్యాపారాలను, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఇన్ఫ్లేషన్ కష్టాలు
అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదు. కంపెనీలు తమ ప్రాఫిట్ మార్జిన్లను కాపాడుకోవడానికి ధరలను పెంచడం లేదా ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల ప్రజలు రోజువారీ ఖర్చుల కోసం రిటైర్మెంట్ ఫండ్స్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఉద్యోగాల కోత - AI ప్రభావం
లేబర్ మార్కెట్ దాదాపు స్తంభించిపోయింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉత్పాదకత పెరగడంతో, చాలా కంపెనీలు నియామకాలను నిలిపివేశాయి. వర్క్ఫోర్స్ కంటే ఆటోమేషన్ వైపు అమెరికన్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
భారతీయ ఇన్వెస్టర్లపై ప్రభావం
ఈ రిపోర్టు మన మార్కెట్లపై రెండు రకాలుగా ప్రభావం చూపవచ్చు:
- వడ్డీ రేట్లు: ద్రవ్యోల్బణం తగ్గకపోతే, ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అలాగే ఉంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లలో వోలటాలిటీని పెంచి, భారత్లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల (FII Flows)పై ప్రభావం చూపుతుంది.
- IT రంగం: భారతీయ IT కంపెనీలకు అమెరికాయే అతిపెద్ద ఆదాయ వనరు. అక్కడ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటూ, AI వైపు మళ్లుతుంటే.. మన IT కంపెనీల ప్రాజెక్టులు, బడ్జెట్లపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అక్టోబర్ నెలాఖరులో జరగబోయే ఫెడ్ పాలసీ మీటింగ్ కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
