ప్రముఖ ఫైనాన్షియల్ కంటెంట్ క్రియేటర్ V Harish అకాల మరణంపై చెన్నై పోలీసులు విచారణ చేపట్టారు. తన రిజిస్ట్రేషన్ అర్హతలపై ఆన్‌లైన్‌లో జరిగిన వివాదం, వేధింపులే కారణమని ఆరోపణలు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
చెన్నైకి చెందిన 27 ఏళ్ల ఫైనాన్షియల్ కంటెంట్ క్రియేటర్ V Harish (Finance With Harish) అకాల మరణంపై కనత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబర్ 20న ముత్తుకాడులోని ఒక ప్రాపర్టీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
అసలేం జరిగింది?
మృతుని తండ్రి వినాయగం దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, Zemuria Inc. సీఈఓ మరియు కంటెంట్ క్రియేటర్ అయిన Jason Samuel పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 18న శామ్యూల్ ఒక వీడియో విడుదల చేస్తూ, హరీష్‌కి SEBI, AMFI వంటి సంస్థల వద్ద సరైన రిజిస్ట్రేషన్ లేదని విమర్శించారు. దీనివల్ల హరీష్‌పై తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపులు జరిగాయని, ఆయన సోషల్ మీడియా ఖాతాలు కూడా డిసేబుల్ అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిబంధనల పకడ్బందీ.. వివాదాలకు తెర
ప్రస్తుతం SEBI ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై నిఘాను పెంచింది. ఎవరైనా పెట్టుబడి సలహాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా Registered Investment Advisor (RIA) లైసెన్స్ ఉండాలని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో, క్రియేటర్లు ఒకరిపై ఒకరు నిబంధనల పేరుతో విమర్శించుకోవడం కొత్త వివాదాలకు దారితీస్తోంది.
స్పందించిన Jason Samuel
ఈ ఆరోపణలను శామ్యూల్ ఖండించారు. తాను ఎవరినీ వేధించలేదని, కేవలం ప్రజల ప్రయోజనం కోసమే నిబంధనలు పాటించని వారిపై నిఘా పెంచాలని కోరానని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు డిజిటల్ ఎవిడెన్స్‌ని పరిశీలిస్తున్నారు. ఆర్థిక కంటెంట్ క్రియేటర్ల బాధ్యత మరియు వారిపై ఉండే నిబంధనల మధ్య ఉన్న సన్నని గీత గురించి ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.
