భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ V. అనంత నాగేశ్వరన్ వివరించారు. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య సంబంధాలు, పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ వెనుకబడి ఉండటం వంటి అంశాలు స్వల్పకాలికంగా ఒత్తిడిని పెంచవచ్చని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) V. అనంత నాగేశ్వరన్ క్షుణ్ణంగా విశ్లేషించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అంతర్గతంగా భారత్ బలంగా ఉన్నప్పటికీ, బాహ్య సవాళ్లను జాగ్రత్తగా అధిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
వాణిజ్య సంబంధాల్లో అస్పష్టత
అమెరికాతో వాణిజ్య సంబంధాలను 'అనిశ్చిత స్థితి'గా నాగేశ్వరన్ అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా తీసుకునే నిర్ణయాలు, టారిఫ్ వివాదాలు వంటి అంశాలు దైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇవి స్వల్పకాలంలో విదేశీ పెట్టుబడులు మరియు కరెన్సీ స్థిరత్వంపై కొంత ప్రభావం చూపవచ్చు.
పెరిగిన రవాణా, ఇంధన ఖర్చులు
దేశీయ ఎగుమతుల పోటీతత్వాన్ని దెబ్బతీసేలా రవాణా (Logistics), భీమా మరియు ఇంధన ధరలు మారుతున్నాయి. ముఖ్యంగా సహజ వాయువు, ఎరువుల ధరల్లో వస్తున్న మార్పులు ఎగుమతిదారులపై అదనపు భారాన్ని మోపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
AI వెనుకబాటు: శాపమా? వరమా?
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు AI కోసం బిలియన్ల కొద్దీ ఖర్చు చేస్తుంటే, భారత్ మాత్రం ఈ రేసులో వెనుకబడి ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే, నాగేశ్వరన్ దీనిని భిన్నంగా చూస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ AI పెట్టుబడులు భారీ అప్పులు, ఊహాగానాల (Speculation) మీద నడుస్తున్నాయని, భవిష్యత్తులో ఇవి కరెక్షన్ ఎదుర్కోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో, స్థిరమైన వృద్ధి గల దేశంగా భారత్ గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని ఆయన అంచనా వేశారు.
చివరిగా, భారత్ యొక్క Debt-to-GDP రేషియో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉందని, దీర్ఘకాలికంగా భారత ఆర్థిక పునాదులు చాలా పటిష్టంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు.
