ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం Nestle India కి FSSAI నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శిశువుల ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రకటనలు మరియు నాణ్యత ప్రమాణాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏకంగా మూడు కేసులు నమోదు చేసింది.
శిశువుల కోసం తయారు చేసే ఆహార పదార్థాల (Infant Nutrition) విషయంలో Nestle India తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 'NAN Excella Pro Stage 1' మరియు 'Lactogen Pro 1' ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్ విధానాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) కన్నెర్ర చేసింది.
మార్కెటింగ్ క్లెయిమ్స్‌పై అభ్యంతరాలు
ఈ మూడు కేసుల్లో రెండు ప్రధానంగా మార్కెటింగ్ నిబంధనలకు సంబంధించినవే. ఉత్పత్తుల ప్యాకేజింగ్ మరియు ప్రకటనల్లో '5 HMOs' ఉన్నాయని, అలాగే ఇవి 'సులభంగా జీర్ణమవుతాయని' (Easy-to-digest) చేసిన క్లెయిమ్స్ అవాస్తవమని లేదా నిబంధనలకు విరుద్ధమని రెగ్యులేటర్ భావిస్తోంది. మన దేశంలో 'Infant Milk Substitutes Act, 1992' ప్రకారం శిశువుల ఆహార ఉత్పత్తుల ప్రచారంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఈ చట్టాలను ఉల్లంఘించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాథమికంగా గుర్తించింది.
నాణ్యతలో లోపాలు
మూడవ కేసు నాణ్యత ప్రమాణాలకు సంబంధించింది. కంపెనీ తయారు చేసిన ఫార్ములాలో ఉండాల్సిన 'బయోటిన్' (Biotin) కంటెంట్ నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. కంపెనీ స్వయంగా పరీక్షించుకున్న శాంపిల్స్ కూడా రిఫరల్ లాబొరేటరీలో ఫెయిల్ అవ్వడం కంపెనీకి ఇబ్బందికరంగా మారింది.
ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి?
ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌కి ఇది దెబ్బతలిగే అవకాశం ఉండగా, మరోవైపు భారీ జరిమానాలు పడే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఈ కేసుల విచారణ దశలో ఉన్నందున, కంపెనీ దీనిపై ఏ విధంగా స్పందిస్తుందనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
