ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్.. ఇప్పుడు పార్లే ప్రొడక్ట్స్ (Parle Products) సంస్థకు గ్లోబల్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
దౌత్యపరమైన బహుమతి వైరల్
రోమ్ లో జరిగిన సమావేశంలో, ప్రధాని మోడీ.. మెలోనికి ఒక ప్యాకెట్ 'మెలోడీ' చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మెలోని కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేస్తూ.. 'చాలా.. చాలా మంచి చాక్లెట్' అని ప్రశంసించారు. దీనికి ప్రధాని మోడీ సరదాగా 'మెలోడీ' అని బదులిచ్చారు. వారిద్దరి పేర్లను కలిపి వచ్చిన 'మెలోడీ' అనే ఇంటర్నెట్ మీమ్ (Melodi meme) ను గుర్తుచేస్తూ జరిగిన ఈ సరదా సంభాషణ.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఇది అంతర్జాతీయ దౌత్యపరమైన సంబంధాలకు ఒక వినోదాన్ని జోడించింది.
పార్లే ప్రొడక్ట్స్ కు అంతర్జాతీయంగా అవకాశాలు
పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయంగ్ షా.. ప్రధాని మోడీ చేసిన ఈ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ గా మంచి గుర్తింపు రావడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఇది మాకు నిజంగా చాలా పెద్ద విషయం' అని షా CNBC-TV18తో మాట్లాడుతూ, 'మెలోడీ' అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకుంటుందని అన్నారు. ఈ బ్రాండ్ ఇప్పటికే 100 కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వైరల్ సంఘటన తర్వాత ఇటలీ ఒక కీలకమైన కొత్త మార్కెట్ గా మారే అవకాశం ఉందని ఆయన సూచించారు. 1970ల చివర్లో భారతదేశంలో ప్రారంభమైన ఈ బ్రాండ్, దాని ప్రత్యేకమైన క్యారమెల్ బయటి పొర, లోపల చాక్లెట్ ఫిల్లింగ్ తో పాటు.. 'మెలోడీ ఖావో, ఖుద్ జాన్ జావో' అనే ఆకట్టుకునే జింగిల్ తో ప్రసిద్ధి చెందింది.
'మెలోడీ' మీమ్ ప్రభావం
2023 నుండి ఈ 'మెలోడీ' మీమ్, నాయకుల పేర్లను కలపడంతో.. COP28, G20 వంటి అంతర్జాతీయ సదస్సులలో వారి పబ్లిక్ ఇంటరాక్షన్ల వల్ల ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు 'మెలోడీ' బ్రాండ్ నేరుగా ఈ మీమ్ లో భాగం కావడం.. దాని వ్యాప్తిని, వాణిజ్య ఆకర్షణను పెంచింది. ఈ వైరల్ క్షణం, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండ్ ఉనికిని బలోపేతం చేస్తుందని, పార్లే ప్రొడక్ట్స్ ఈ ఊహించని పబ్లిసిటీని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది.
