భారత మార్కెట్లో IKEA తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సరికొత్త వ్యూహం సిద్ధం చేసింది. 2030 నాటికి రెవెన్యూను 4 రెట్లు పెంచడమే లక్ష్యంగా 'హబ్-అండ్-స్పోక్' మోడల్‌ను అమలు చేస్తోంది. FY25లో కంపెనీ ₹1,749 కోట్ల రెవెన్యూను నమోదు చేయగా, నష్టాలు ₹1,325 కోట్లకు పెరిగాయి.
స్వీడిష్ రిటైల్ దిగ్గజం IKEA, భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకునేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పటివరకు కేవలం నగర శివార్లలో పెద్ద పెద్ద స్టోర్లను మాత్రమే ఏర్పాటు చేసిన సంస్థ, ఇప్పుడు ఆ వ్యూహాన్ని మార్చింది. నగర నడిబొడ్డున చిన్న సైజు స్టోర్లను ఏర్పాటు చేస్తూ, 'హబ్-అండ్-స్పోక్' మోడల్‌తో వినియోగదారులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. బెంగళూరులో ఇటీవల ప్రారంభించిన 80,000 చదరపు అడుగుల స్టోర్ దీనికి తొలి అడుగు.
ఆర్థిక సవాళ్లు ఇలా ఉన్నాయి:
కంపెనీ వృద్ధి బాటలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. FY25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి IKEA ఇండియా ₹1,749 కోట్ల రెవెన్యూను ప్రకటించింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.3% తగ్గింది. అలాగే, కంపెనీ నష్టాలు ₹1,299 కోట్ల నుండి ₹1,325 కోట్లకు పెరిగాయి. ఈ నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థ 2030 నాటికి ₹21,000 కోట్ల పైగా పెట్టుబడిని పెట్టాలని నిర్ణయించుకుంది.
పోటీని తట్టుకునేలా ధరలు:
భారతదేశంలో Godrej Interio, Home Centre మరియు Pepperfry వంటి సంస్థల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్న IKEA, ప్రైసింగ్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోంది. స్థానిక మార్కెట్‌తో పోలిస్తే కిచెన్ మరియు ఫర్నిచర్ ఉత్పత్తులను 25% నుండి 30% తక్కువ ధరకే విక్రయిస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గ్లోబల్ సప్లై చైన్ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ధరలను పెంచకుండా కస్టమర్లకు ఊరటనిస్తోంది. ముఖ్యంగా ఆన్లైన్ సేల్స్ మరియు B2B సేవల ద్వారా వచ్చే ఆదాయం, మొత్తం రెవెన్యూలో 30% వాటాను కలిగి ఉండటం కంపెనీకి కలిసొచ్చే అంశం.
