పన్నుల పెంపు.. అక్రమ వ్యాపారానికి లైన్ క్లియర్!
ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చిన నూతన పన్నుల విధానం.. సిగరెట్ల ధరలను ఒక్కో ప్యాక్‌కు (10 స్టిక్స్) దాదాపు ₹22 నుంచి ₹25 వరకు పెంచేసింది. ఈ ఆకస్మిక ధరల పెరుగుదల వినియోగదారులను అక్రమ మార్కెట్ వైపు నెట్టేస్తుందని, స్మగ్లింగ్ వస్తువుల డిమాండ్ దాదాపు 39% మేర పెరగొచ్చని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏటా అక్రమ సిగరెట్ల వినియోగం 46 బిలియన్ స్టిక్స్‌ను దాటే అవకాశం ఉందని అంచనా. చారిత్రకంగా చూస్తే, పొగాకు ఉత్పత్తులపై భారీ పన్నుల పెంపుదల ఎప్పుడూ అక్రమ వ్యాపారానికి ఊతమిచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఇప్పటికే 26.1% మార్కెట్ వాటా అక్రమ సిగరెట్లదే.
FCV రైతులకు పెను ముప్పు.. లక్షలాది మంది ఉపాధికి గండం!
ఈ పన్నుల భారం ఫ్లూ-క్యూర్డ్ వర్జీనియా (FCV) పొగాకు పండించే రైతులకు తీవ్ర నష్టం కలిగించనుంది. రాబోయే కాలంలో FCV పంట కొనుగోళ్లు 20% వరకు తగ్గుతాయని, దీనివల్ల సుమారు 26 లక్షల మనుషుల పని దినాల (man-days) ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయ రంగంపై, ముఖ్యంగా మహిళా కార్మికులపై ఇది మరింత భారం మోపుతుంది. FCV పొగాకుపై పన్నుల భారం, బీడీలు, నమిలే పొగాకుతో పోలిస్తే ఎన్నో రెట్లు అధికంగా ఉందని, ఈ 'వివక్షాపూరిత పన్నుల విధానం' కారణంగానే 2011-12 నుంచి 2023-24 మధ్య కాలంలో FCV సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య తగ్గుతూ వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
విస్తృత ఆర్థిక, ఆదాయ లోటు ప్రమాదం!
కేవలం పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కంటే, ఈ విధానం వల్ల కలిగే విస్తృత ఆర్థిక నష్టాలు అధికంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తగ్గుతున్న రైతుల ఆదాయాలు, లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం, గిడ్డంగులు, రవాణా వంటి అనుబంధ పరిశ్రమలపై పడే ప్రతికూల ప్రభావం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. సిగరెట్ వాల్యూమ్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6-8% తగ్గుతాయని Crisil రేటింగ్స్ అంచనా వేసింది. బీడీలపై సగటున కేవలం 9% పన్ను ఉండగా, సిగరెట్లపై ఈ భారం దాదాపు 38% వరకు ఉంటోంది. ఈ అసమానత, సమగ్ర పొగాకు నియంత్రణ లక్ష్యాలను దెబ్బతీయడమే కాకుండా, మార్కెట్లలో మరింత వక్రీకరణకు దారితీస్తుంది. స్వల్పకాలిక ఆదాయ లక్ష్యాలతో చేపట్టిన ఈ పన్నుల పెంపుదల, దీర్ఘకాలంలో ప్రభుత్వ ఆదాయ లోటును పెంచే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
