బంగారం, వెండి ధరల్లో తాత్కాలిక తగ్గుదల: ఇన్వెస్టర్లకు ఇదేనా కొనుగోలు సమయం?
గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం, వెండి ధరలు బుధవారం కాస్త చల్లబడ్డాయి. భారీ ర్యాలీ తర్వాత వచ్చిన ఈ కరెక్షన్ ను మార్కెట్ నిపుణులు ఒక ఆరోగ్యకరమైన మార్పుగా చూస్తున్నారు. ట్రెండ్ మాత్రం ఇంకా పాజిటివ్ గానే ఉందని, ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు పెరుగుతున్నాయని అంటున్నారు.
ధరల వివరాలు..
అంతర్జాతీయ మార్కెట్ (COMEX) లో బంగారం ధర $5,600 పైనుంచి $5,160–$5,320 రేంజ్ కు పడిపోయింది. అలాగే, వెండి కూడా $121.6 రికార్డు స్థాయి నుంచి $108–$111 వద్దకు చేరింది. దేశీయంగా MCX లో కూడా బంగారం సుమారు ₹1,80,779 ఆల్-టైమ్ హై నుంచి ₹1,63,000 – ₹1,80,500 మధ్య ట్రేడ్ అవుతోంది. వెండి కూడా ఈ స్థాయిలలోనే స్థిరపడింది.
నిపుణుల విశ్లేషణ..
ఎన్రిచ్ మనీ (Enrich Money) సీఈఓ పోన్ముడి ఆర్ (Ponmudi R) మాట్లాడుతూ, "ఇది సహజమైన, ఆరోగ్యకరమైన కూలింగ్-ఆఫ్ పీరియడ్. తక్కువ ధరల్లో కొన్నవారు లాభాలు తీసుకోవడం (Profit Booking) వల్లే ఇలా జరిగింది. ధరలు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు జరుగుతుండటం చూస్తే, అతి పెద్ద ట్రెండ్ మాత్రం మారలేదని అర్థమవుతోంది" అని తెలిపారు.
సపోర్ట్ లెవెల్స్, మార్కెట్ కారణాలు..
ధరలు తగ్గినా, ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ (Support Levels) వద్ద బయ్యింగ్ ఆసక్తి కనిపిస్తోంది. అంతర్జాతీయ గోల్డ్ కు $5,050–$5,150 మధ్య, దేశీయ గోల్డ్ కు ₹1,57,000–₹1,59,000 మధ్య మంచి సపోర్ట్ ఉంది. వెండికి ₹3,55,000–₹3,60,000 వద్ద సపోర్ట్ దొరుకుతోంది. భౌగోళిక అనిశ్చితులు, ఆర్థిక అస్థిరత, బలహీనపడుతున్న అమెరికా డాలర్, ఫెడ్ వడ్డీ రేట్లలో మార్పులు లేకపోవడం వంటివి బంగారం, వెండి ధరలకు అండగా నిలుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే, వెండి ధర దాదాపు 254.98%, బంగారం ధర 86.83% పెరిగాయి. సిల్వర్ కు ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్స్, AI వంటి రంగాల నుంచి డిమాండ్ కూడా పెరుగుతోంది.
ఇన్వెస్టర్లకు సూచన..
ప్రస్తుత ధరల తగ్గుదలను లాంగ్-టర్మ్ ఇన్వెస్టర్లకు మార్కెట్ లోకి ప్రవేశించడానికి ఒక మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితమైన బాటమ్ (Bottom) కోసం చూడకుండా, దశలవారీగా (Staggered Buying) కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. షార్ట్-టర్మ్ ట్రేడర్లు మాత్రం, ప్రస్తుతానికి ఈ మెటల్స్ కొంచెం ఓవర్ హీట్ (Overheated) అయ్యాయని, అందువల్ల స్వల్పకాలికంగా ధరల్లో ఎక్కువ అస్థిరత (Volatility) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
భవిష్యత్ అంచనాలు..
ఈ త్రైమాసికం చివరి నాటికి వెండి ధర $105.07/oz, బంగారం ధర $5,045.82/oz వరకు చేరవచ్చని అంచనాలున్నాయి.