బంగారం సేఫ్-హేవెన్ స్టేటస్ పై నీలినీడలు?
సాధారణంగా ఏదైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనప్పుడు బంగారం ధరలు పెరగడం మనం చూస్తుంటాం. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలైన తర్వాత, బంగారం ధరలు నెల రోజుల్లోనే $5,278 నుంచి $4,576 కు పడిపోయాయి. ఇది ఏకంగా 14% పతనం. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి అనే భావనకు ఇది సవాలు విసురుతోంది.
చమురు ధరల మంట.. బంగారం అమ్మకాల ఒత్తిడి!
పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల చమురు, గ్యాస్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత నెలలో 40% పెరిగాయి. దీనితో, చమురును ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలపై ఆర్థిక భారం పెరిగింది. అధిక చమురు దిగుమతి బిల్లులను చెల్లించుకోవడానికి.. ఆ దేశాలు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ బంగారం అమ్మకాల ఒత్తిడినే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడానికి ప్రధాన కారణంగా మారింది.
ఇన్వెస్టర్లకు ఇప్పుడు ఏం చేయాలి?
చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు బంగారం ధరలు పుంజుకోవడం కష్టమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం మాత్రమే కాదు, ఈ పరిస్థితి స్టాక్స్, బాండ్స్ వంటి ఇతర ఆర్థిక ఆస్తులపై కూడా ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనం (Recession) భయాలతో.. పెట్టుబడిదారులు ఏం చేయాలో తేల్చుకోలేక పోతున్నారు. కొంతమంది తక్కువ ధరలకు కొని దీర్ఘకాలిక లాభాల కోసం ఎదురుచూస్తుంటే, మరి మరికొందరు మరింత నష్టాలను చవిచూడాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రిస్క్ తీసుకోలేని వారు అప్రమత్తంగా ఉండటం మంచిది.